అమరావతి: సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధిపతి మోహన్ బాబుపై ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబ రావు మరోసారి విరుచుకుపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మోహన్ బాబు వంతపాడుతున్నారని ఆయన అన్నారు. 

మంచు ఫ్యామిలీ అంటే ముంచే ఫ్యామిలీ అని కుటుంబ రావు అన్నారు. మోహన్ బాబును సెలిబ్రీటీ ముసుగు వేసుకున్న దొంగగా అభివర్ణించారు. మోహన్ బాబుకు కావాల్సింది సెలబ్రీటీ స్టేటస్... ధనికులతో పరిచయాలు.. పేజ్-త్రీలో పబ్లిసిటీ మాత్రమేనని ఆన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై మోహన్ బాబు వ్యాఖ్యలను ఖండించారు. 

వాస్తవాలు తెలియకుండా మోహన్ బాబు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.. ఫైల్ తీసుకుని రండి.. బాకీ ఎంత ఉందో తెలుసుకుని మిగతా కాలేజీలతో పాటు ఇచ్చేస్తామని అన్నారు. ధర్నాల పేరుతో విద్యార్థుల భవిష్యత్తును చెడగొడుతున్నారని ఆయన మోహన్ బాబుపై మండిపడ్డారు.
 
ముసుగు తీసి వైసీపీ తరఫున ప్రచారం చేసుకోవాలని ఆయన సూచించారు. అప్పుడు తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. ప్రజలను మాయ చేసి.. ఫూల్స్ చేస్తున్నారన్నారు. తనపై బురద చల్లడానికి ప్రయత్నించారని ఆయన అన్నారు. వాస్తవాలపై మాట్లాడరని.. వాళ్లేదో డిస్కవరీ ఆఫ్ ఇండియాలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. 

మోహన్ బాబు ఎంత పెద్ద నటుడో తనకైతే తెలియదని, పద్మశ్రీ ఇచ్చారు కాబట్టి పెద్ద నటుడే అయ్యి ఉంటారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. పద్మశ్రీ వచ్చిన మహానటులు చాలా మంది ఉన్నారని, కానీ మోహన్ బాబుకు వచ్చినందుకు బాధపడుతున్నానని చెప్పారు. మోహన్ బాబుకు డాక్టర్ రేట్ కూడా ఉందట అని అంటూ తనకైతే తెలియదని అన్నారు.

మోహన్ బాబు విద్యను వ్యాపారంగా మార్చారని ఆయన విమర్శించారు. బిల్డింగ్ ఫీజులు, డొనేషన్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తు్నారని ఆయన ఆరోపించారు. లెక్చరర్లకు అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారని అన్నారు. కేవలం రాజకీయాల కోసమే మోహన్ బాబు డ్రామాలు ఆడుతున్నారని ఆయన అన్నారు. మీ కాలేజీలో విద్యాశాఖతో విచారణకు సిద్ధమా అని ఆయన మోహన్ బాబుకు సవాల్ విసిరారు.