కర్నూలు: తెలుగుదేశం పార్టీ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి చెందిన కేబుల్ సిగ్నల్ పంపిణీ సంస్థపై పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. సాఫ్ట్ వేర్ పైరసీ పాల్పడ్డారనే ఆరోపణపై పోలీసులు సోదాలు చేశారు. 

పోలీసు దాడులతో మహాలక్ష్మి డిజిటల్ కేబుల్, కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ స్థానిక కార్యక్రమాల రిలే ఆగిపోయాయి. సాఫ్ట్ వేర్ పైరసీకి పాల్పడ్డారనే ఆరోపణలవు రావడంతో కాపీరైట్ సేఫ్టీ సిస్టమ్స్ (సిఎస్ఎస్) ఎండీ హెచ్.వి. చలపతి రాజు, యాంటీ పైరసీ సెల్ సభ్యులు, పోలీసులు సంయుక్తంగా మహాలక్ష్మి కెబుల్ కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎండిసిసి) కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. కేసు కూడా నమోదు చేశారు. 

తమకు అన్ని రకాల సాఫ్ట్ వేర్ అనుమతులు ఉన్నాయని, పైరసీ ఏదీ లేదని ఎండిసిసి సీఈవో మహేష్ అంటున్నారు. కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని ఇన్ స్పెక్టర్ మహేశ్వర్ రెడ్డి చెబుతున్నారు.

కేఈ కృష్ణమూర్తి టీడీపీ సీనియర్ నాయకుడు. ఆయన కర్నూలు జిల్లా రాజకీయాల్లో అత్యంత ప్రముఖమైన పాత్ర నిర్వహిస్తున్నారు. చంద్రబాబు మంత్రివర్గంలో ఆయన డిప్యూటీ సిఎంగా పనిచేశారు.