కర్నూలు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీ నేతలు గట్టి షాక్ ఇచ్చారు. ఎన్నికలు పూర్తైన తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటించారు. కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్తున్న చంద్రబాబు ఎన్నికల సరళిపై సమీక్ష నిర్వహించాలని భావించారు. 

అందులో భాగంగా పార్టీ కార్యాలయం నుంచి కర్నూలు జిల్లాకు చెందిన అభ్యర్థులకు సమాచారం కూడా ఇచ్చారు. ఇక అనుకున్న షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా చేరుకున్నారు. 

ఎన్నికల సరళిపై అంచనా వేసేందుకు, ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల్లో ఉత్సాహం నింపేందుకు చంద్రబాబు రివ్యూ నిర్వహించారు. అయితే ఆ రివ్యూకు కీలక నేతలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. 

ముఖ్యంగా మంత్రి భూమా అఖిలప్రియ, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, తిక్కారెడ్డిలతోపాటు పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థులు టీజీ భరత్, కేఈ శ్యాంబాబు, మీనాక్షినాయుడు, కేఈ ప్రతాప్ లు సమావేశానికి గైర్హాజరయ్యారు. ఎంతసేపు చూసినా రాకపోవడంతో చేసేది లేక చంద్రబాబు హాజరైన నేతలతోనే సమీక్ష జరిపాల్సిన పరిస్థితి నెలకొంది. 

మళ్లీ తెలుగుదేశం పార్టీయే అధికారంలోకి వస్తుందని ఎవరూ నిరుత్సాహం చెందొద్దని సూచించారు. అనంతరం ఎయిర్‌ పోర్టు నుంచి హెలికాప్టర్‌లో ఎన్నికల ప్రచారం నిమిత్తం కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లాకు సీఎం బయలుదేరి వెళ్లిపోయారు. 

ఇకపోతే జిల్లాకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి హాజరైతే అత్యధిక సంఖ్యలో నేతలు గైర్హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థులంతా ఎన్నికల్లో పోటీ చేసి రిలాక్స్ అవుతున్న సమయంలో కూడా ముఖ్యమంత్రి వస్తే రాకపోవడంపై పెద్ద ఎత్తున గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఉండే హాజరు కాలేదా లేక మనసులో ఏదైనా ఉందా అంటూ చెవులుకొరుక్కుంటున్నారు.