సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర మీద అసత్య వార్తలు రాశారంటూ విలేకరుల మీద కర్నూలు నగర మేయర్ విరుచుకుపడ్డారు. వారి వీపులు వాయగొడతాం అంటూ హెచ్చరించారు.
కర్నూలు : ‘సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర వచ్చిన సమయంలో మధ్యాహ్నం ఎండ ఉందని నీడచాటుకు ప్రజలు వెళితే.. ఎవరూ లేరు అంటూ ఫోటోలు తీసి కొన్ని పత్రికలు పనిగట్టుకుని ప్రచారం చేశాయి. ఆ పత్రికల విలేకరుల వీపులు వాయగొడతాం జాగ్రత్త..’ అని కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా కర్నూలులోని పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ విగ్రహానికి సోమవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇదిలా ఉండగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులు నిర్వహిస్తున్న సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర మే28న నరసరావుపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు మాట్లాడుతూ… ఎస్సీ, ఎస్టీ, బిసి మైనార్టీలకు టిడిపి మహానాడు వ్యతిరేకమన్నారు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీనే అన్నారు. బీసీలకు చంద్రబాబు ఇచ్చే గౌరవం ఇదేనా అని మంత్రులు ప్రశ్నించారు. మహానాడులో అచ్చెన్నాయుడు బొమ్మ కూడా లేదని సామాజిక న్యాయం యాత్ర చేసే హక్కు తమకే ఉందని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలు బస్సు యాత్రకు నీరాజనాలు పడుతుంటే చంద్రబాబుకు భయం వేస్తోందని.. అందుకే అబద్ధాలు ఏడుస్తున్నాడని మంత్రులు మండిపడ్డారు.
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ పరిపాలిస్తున్నారు అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజకీయ అవకాశాలు కల్పించింది జగన్ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. కేబినెట్‌లో 74 శాతం బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించిన ఘనత సీఎం జగన్ దేనని ఆదిమూలపు సురేష్ అన్నారు. టీడీపీ హయాంలో గిరిజన మైనారిటీ శాఖలకు మంత్రులు కూడా లేని పరిస్థితి నెలకొందని ఆయన గుర్తు చేశారు. తెలుగుదేశం హయాంలో బలహీన వర్గాలను ఓటు బ్యాంకుగానే చూశారని మంత్రి అన్నారు.
మంత్రి జోగు రమేష్ మాట్లాడుతూ బలహీన వర్గాలను వాడుకుని వదిలేసిన చరిత్ర చంద్రబాబుది అని ఎద్దేవా చేశారు. పొత్తులు పెట్టుకున్నా, పొర్లుదండాలు పెట్టినా చంద్రబాబు ఓటమి ఖాయమని జోగి రమేష్ చెప్పారు. 2024 ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయం అన్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ మూడేళ్లలో జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు. బడుగు బలహీన వర్గాల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు నేరుగా అందుతున్నాయని మూడేళ్లలోనే 90 శాతానికి పైగా హామీలను నెరవేర్చారని ధర్మాన స్పష్టం చేశారు.
నాడు నేడు ద్వారా గ్రామాల్లో పాఠశాలలు ఆధునికరిస్తున్నామని మంత్రి చెప్పారు. సమాజంలో అంతరాలు తగ్గించేలా సీఎం జగన్ పరిపాలన చేస్తున్నారని.. ఎలాంటి అవినీతి లేకుండా నేరుగా సంక్షేమ ఫలాలు అందజేస్తున్నామని అన్నారు. కరోనా సంక్షోభంలోనూపథకాల అమలు నిలిచిపోలేదని ధర్మాన స్పష్టం చేశారు. కోవిడ్ సమయంలోనూ రాష్ట్ర ప్రజలకు జగన్ అండగా నిలిచారని.. తొమ్మిది నెలల పాటు ప్రజలకు నిత్యావసరాలు ఉచితంగా అందజేశారని తెలిపారు. టీడీపీ హయాంలో అంతా దోపిడీ పాలనే జరిగిందని.. జన్మభూమి కమిటీల పేరుతో దోచుకు తింటున్నారని ధర్మాన ఆరోపించారు.
