రాష్ట్రానికి , దేశానికి ఉద్ధండులైన నేతలను అందించిన నేలగా , తెలుగు రాజకీయానికి నాయకత్వం చూపిన నేలగా కర్నూలు చరిత్ర ప్రత్యేకం. రాయలసీమ ముఖద్వారంగా .. రాజకీయానికి అసలు సిసలు అర్ధాన్ని పరిచయం చేసింది కర్నూలు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆరుసార్లు ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. ఆయన కుమారుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కూడా ఎంపీగా సేవలందించారు. కాంగ్రెస్ పార్టీ 13 సార్లు, టీడీపీ , వైసీపీ రెండు సార్లు, ఇతరులు రెండు సార్లు కర్నూలు లోక్‌సభలో విజయం సాధించారు. కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో కర్నూలు, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోనీ, ఆలూరు శాసనసభ నియోజకవర్గాలున్నాయి. 

పౌరుషాల పురిటిగడ్డ.. రాయలసీమలోని అతిపెద్ద నగరం కర్నూలు రాజకీయాలు ఎప్పుడూ భగభగమంటూనే వుంటాయి. రాష్ట్రానికి , దేశానికి ఉద్ధండులైన నేతలను అందించిన నేలగా , తెలుగు రాజకీయానికి నాయకత్వం చూపిన నేలగా కర్నూలు చరిత్ర ప్రత్యేకం. రాయలసీమ ముఖద్వారంగా .. రాజకీయానికి అసలు సిసలు అర్ధాన్ని పరిచయం చేసింది కర్నూలు. హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ నగరం నుంచి ఎంపీగా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆరుసార్లు ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. ఆయన కుమారుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కూడా ఎంపీగా సేవలందించారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు కూడా కర్నూలు ఒకప్పుడు కేంద్రంగా నిలిచింది. 

కర్నూలు ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. దిగ్గజాలను పార్లమెంట్‌కు పంపిన గడ్డ :

కర్నూలు లోక్‌సభ పరిధిలో రెడ్డి సామాజికవర్గానిదే ఆధిపత్యం. రాష్ట్రంలో ఏ పార్టీ పవర్‌లో వున్నా రెడ్డి సామాజికవర్గమే శాసిస్తుంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీది ఏకఛత్రాదిపత్యం. ఉమ్మడి ఏపీకి తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఈ లోక్‌సభ పరిధికి చెందిన వ్యక్తే. ఆయన కర్నూలు, ఎమ్మిగనూరు, కోడుమూరు నుంచి శాసనసభకు ప్రాతినిథ్యం వహించారు. ఎంపీగా, కేంద్రమంత్రిగా, గవర్నర్‌గా పనిచేసిన పెండేకంటి వెంకట సుబ్బయ్య కూడా కర్నూలుకు చెందినవారే. కాంగ్రెస్ పార్టీ 13 సార్లు, టీడీపీ , వైసీపీ రెండు సార్లు, ఇతరులు రెండు సార్లు కర్నూలు లోక్‌సభలో విజయం సాధించారు. 

కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో కర్నూలు, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోనీ, ఆలూరు శాసనసభ నియోజకవర్గాలున్నాయి. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 15,71,954 మంది. వీరిలో ఎస్సీ ఓటర్లు 2,75,092 మంది.. ఎస్టీ ఓటర్లు 20,435 మంది.. గ్రామీణ ఓటర్లు 10,45,349 మంది.. పట్టణ ఓటర్ల సంఖ్య 5,26,605 మంది. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి సంజీవ్ కుమార్ 6,02,554 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి 4,53,665 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 1,48,889 ఓట్ల మెజారిటీతో కర్నూలును సొంతం చేసుకుంది .

కర్నూలు ఎంపీ (పార్లమెంట్) ఎన్నికల ఫలితాలు 2024 .. హ్యాట్రిక్‌పై వైసీపీ గురి :

కర్నూలులో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని భావిస్తోన్న వైసీపీ ఈ మేరకు వ్యూహాలు రచిస్తోంది. సిట్టింగ్ ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామా చేయడంతో ఆయనకు బదలుగా బీవై రామయ్యను సమన్వయకర్తగా నియమించింది. తొలుత ఈ స్థానాన్ని మంత్రి గుమ్మనూరు జయరాంకు జగన్ కేటాయించారు. కానీ మరోసారి అసెంబ్లీకే పోటీ చేయాలనుకున్న జయరాం.. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించారు. ఆపై వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. దీంతో బీవై రామయ్యను జగన్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు.

టీడీపీ విషయానికి వస్తే.. వైసీపీని ఎదుర్కోవడానికి బలమైన నేతను నిలబెట్టాలని నిర్ణయించింది. రెడ్డి సామాజికవర్గం కాకుండా బీసీకి ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. గతంలో బోయ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చిన తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు కురుబ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఆ కమ్యూనిటీకి చెందిన బస్తిపాడు నాగరాజు పేరు వినిపిస్తోంది. అయితే మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, కేఈ కుటుంబ సభ్యులతో పాటు పలువురు బీసీ నేతలు టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.