ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డి  నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డి  నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పదవీకాలం ఈ నెల 30తో ముగుస్తున్న సంగతి  తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం నూతన సీఎస్‌ నియామకం చేపట్టింది. ఇప్పటి వరకు జవహర్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 1990 బ్యాచ్ ఐఎఎస్ అధికారి అయిన జవహర్ రెడ్డి.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌తో సహా అనేక కీలక పదవులను నిర్వహించారు. 

ఒకటి, రెండు రోజుల్లో సీఎస్‌గా జవహర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. జవహర్ రెడ్డి 2024 జూన్ వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. ఆయన సీఎస్‌గా ఉన్న సమయంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 

ఇక, ఏపీ నూతన సీఎస్‌ ఎంపిక సమయంలో సీనియారిటీ జాబితాలో 1987వ బ్యాచ్‌కు చెందిన నీరభ్ కుమార్ ప్రసాద్, 1988 బ్యాచ్‌కు చెందిన పూనం మాలకొండయ్య, 1989 బ్యాచ్‌కు చెందిన కరికాల్ వలెవన్‌తో పాటు,  1988 బ్యాచ్‌కు చెందిన గిరిధర్ అరమనే(ఏపీ క్యాడర్- ప్రస్తుతం కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శిగా ఉన్నారు) పేర్లు కూడా గట్టిగానే వినిపించింది.  గిరిధర్ శనివారం జగన్‌ను కలవడంతో..  ఆయన కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రేసులో ఉండవచ్చనే ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ సీఎం జగన్ మాత్రం జవహర్ రెడ్డిని సీఎస్‌గా నియమించేందుకు మొగ్గు చూపారు.