Asianet News Telugu

రఘురామ టీవీ చానెల్స్ వద్ద డబ్బులు తీసుకుని కుట్ర... సుప్రీంలో జగన్ సర్కార్

ఈ కుట్రలో భాగంగా టీవీ చానళ్లకు, రఘురామరాజు కృష్ణంరాజు కు నడుమ డబ్బు లావాదేవీలు కూడా జరిగాయని ఆరోపించింది. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తమ పార్టీ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక చర్యలపైన రాజద్రోహం కేసు పెట్టిన సంగతి తెలిసిందే.

Krishnam Raju took payment from Andhra channels: Andhra governament files affidavit in supreme - bsb
Author
Hyderabad, First Published Jul 19, 2021, 9:37 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

జగన్ సర్కారు తమ పార్టీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు  ‘‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5’’ చానెళ్లతో టీడీపీతో కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేశారని ఆరోపిస్తూ సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసింది.

ఈ కుట్రలో భాగంగా టీవీ చానళ్లకు, రఘురామరాజు కృష్ణంరాజు కు నడుమ డబ్బు లావాదేవీలు కూడా జరిగాయని ఆరోపించింది. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తమ పార్టీ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక చర్యలపైన రాజద్రోహం కేసు పెట్టిన సంగతి తెలిసిందే.

తనపై పెట్టిన కేసు అక్రమమంటూ రెండు ఛానళ్లు రాజ్యాంగంలోని 32వ అధికరణ ప్రకారం వేర్వేరుగా సుప్రీంను ఆశ్రయించాయి. జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్ రవీంద్ర భట్ లతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్లపై మే 31న విచారణ జరిపి ఈ కేసులో మీడియా పై దుందుడుకు చర్య చర్యలు వద్దని హెచ్చరించిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన ఏపీ సర్కార్.. అందులో పలు ఆరోపణలు చేసింది. ఒక సందర్భంలో రఘురామ రాజు కు టీవీ 5 చైర్మన్ 10 లక్షల యూరోలు (దాదాపు రూ. 8.8 కోట్లు) బదిలీ చేసినట్లు తెలుస్తోందని..  అందుకు బదులుగా (క్విడ్ప్రోకో).. రఘురామరాజు తన పదవిని ఆయా న్యూస్ ఛానళ్లకు సంబంధించిన వ్యక్తుల ప్రయోజనాల కోసం వినియోగించాలని ఆరోపించింది.

ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రాన్ని తాము పవిత్రమైనది గానే భావిస్తామని, పత్రికలకు ప్రజాస్వామ్యంలో కీలకమైన పాత్ర ఉందని, అయితే. వాటిని ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను, విద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి అనుమతించ లేమని తెలిపింది. మీడియా సంస్థలు ప్రజలకు ట్రస్టీలాంటివని అవి ప్రజల ప్రయోజనాల కోసమే తమ వేదికలను ఉపయోగించుకోవాలి తప్ప మరో రకంగా కాదని పేర్కొంది. 

రఘురామకృష్ణ రాజు చేసిన ప్రసంగాలు, ఇచ్చిన ఇంటర్వ్యూలను ముందుగానే ఒక పథకం ప్రకారం తయారు చేసి ప్రసారం చేశారని... న్యూస్ చానల్స్, టిడిపి సభ్యులు, రఘురామకృష్ణంరాజు వివరంగా చర్చించుకున్న తర్వాతనే ఈ ప్రసారాలు జరిగాయని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. ఆయన ప్రసంగాలు క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దీనివెనక ఉన్నట్టు ఆరోపించింది. 

రఘురామరాజు, చంద్రబాబు, లోకేష్ మధ్య ఫోన్లలో జరిగిన సంభాషణలు, వారు షేరు చేసుకున్న డాక్యుమెంట్లు... ప్రజాస్వామికంగా ఎన్నికైన వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన పెద్ద కుట్రను వెల్లడిస్తున్నాయని జగన్‌ సర్కార్‌ తమ అఫిడవిట్లో ఆరోపించింది.

దర్యాప్తు సమయంలో రఘురామకృష్ణరాజు నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ ను పరిశీలించి రూపొందించిన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్, ఆయన సెల్ఫోన్ నుంచి వచ్చిన మొత్తం ఎలక్ట్రానిక్ వివరాలను కోర్టు ముందు ఉంచినట్లు తెలిసింది.  రఘురామకృష్ణంరాజు ప్రెస్‌ మీట్ల తర్వాత మీడియా వ్యక్తుల నుంచి ఆయనకు ప్రశంసలు వచ్చాయని ఆరోపించిన జగన్ ప్రభుత్వం... అందులో కొన్నింటిని అఫిడవిట్ లో ఉటంకించింది. 

‘‘వావ్.. మీరు మంచి పంచ్ ఇచ్చారు’’, ‘సింహం ఒంటరిగా వస్తుంది. పందులు గుంపుగా వస్తాయి’, ‘మీ సమాధానాలతో సోషల్ మీడియాలో ఉద్రేకం చెలరేగింది’,   ‘మీ దారి రహదారి’, ‘మీరు పార్టీకి పెద్ద బొక్క పెడుతున్నారు’,  ‘సింహం కూర్చున్నదే సింహాసనం’, ‘ మీ ఇంటర్వ్యూ సూపర్ హిట్’,  ‘మీ ఇంటర్వ్యూ మళ్లీ ఇవ్వాళ సూపర్హిట్ అయింది.  యూట్యూబ్ స్ట్రీమ్ 10 వేలు దాటింది’..  అంటూ ఛానళ్లు రఘురామరాజు ప్రశంసించారని ఆరోపించింది.  

రఘురామకృష్ణంరాజు పార్లమెంటు సభ్యుడు అయ్యుండి, ఉద్దేశపూర్వకంగా తన అధికారాన్ని దుర్వినియోగ పరిచి, వివిధ వర్గాల ప్రజల మధ్య, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో వ్యతిరేకతను ఉసిగొలిపేలా వ్యవహరించారని... ఈ మేరకు సోషల్ మీడియా వేదికలపై, మీడియా ఛానళ్ల ద్వారా విద్వేష పూరిత ప్రసంగాలు చేశారని అఫిడవిట్‌లో ఆరోపించింది. 

రాజు ప్రెస్ కాన్ఫరెన్స్ లను ఛానల్ లో తమ విధుల్లో భాగంగా మాత్రమే చేయలేదని.. రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం చేశాయని, వివిధ సామాజిక వర్గాల మధ్య శత్రుత్వాన్ని, ప్రభుత్వం పట్ల విద్వేషాన్ని రెచ్చగొట్టి, హింసకు  ప్రేరేపించే కుట్రకు పాల్పడ్డాయని ఆరోపించింది. ఈ కేసులో ఇప్పటి దాకా సేకరించిన ఆధారాలను పరిశీలిస్తే... పిటిషనర్లు (ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ ఫైవ్) ఒక వర్గం ప్రజలను మరో వర్గం పైకి రెచ్చగొట్టే కుట్రలో చురుగ్గా పాల్గొనడమే కాకుండా,  ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలు చేసేలా కుట్ర పన్నాయని ఆరోపించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios