న్యూఢిల్లీ: పార్టీ నాయకత్వం ఆదేశిస్తే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మాజీమంత్రి, నటుడు కృష్ణం రాజు తెలిపారు. మోడీయే తిరిగి ప్రధాని కావాలని మనస్ఫూరిగా కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. 

ప్రజల్లో మోడీకి  అనూహ్య మద్దతు పెరుగుతోందని కృష్ణంరాజు అన్నారు. ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సమావేశాల్లో పాల్గొన్న ఆయన ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.

సేవకుడంటే మోడీలా ఉండాలని, ఆయన ప్రసంగం వింటే మరోసారి గెలిచినంత సంతోషంగా ఉందన్నారు. అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లపై అన్ని వర్గాల నుంచి అభినందనలు వస్తున్నాయని అన్నారు. 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం నిధులు విడుదల చేస్తున్నప్పటికీ కొందరు మాత్రం నిధులు రావడం లేదని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.