అమరావతి: శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్రాన్ని ఆదేశించినట్టుగా కృష్ణా బోర్డు తెలిపింది. ఈ విషయంలో తమ ఆదేశాలను పట్టించుకోని తెలంగాణపై  కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేసినట్టుగా కృష్ణా బోర్డు తెలిపింది.

ఏపీ నీటి పారుదల శాఖకు కృష్ణా బోర్డు గురువారం నాడు లేఖ రాసింది. రెండు రాష్ట్రాల పట్ల తాము సమాన దృష్టితో ఉన్నామని ఆ లేఖలో కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి ఎల్బీ యుయన్ తంగ్ లేఖలో పేర్కొన్నారు.

ప్రాజెక్టుల్లో రెండు రాష్ట్రాల్లో వాడుతున్న నీటి విషయంలో ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుండి కేటాయించిన 9 టీఎంసీల కంటే అదనంగా 0.517 టీఎంసీలను ఏపీ ప్రభుత్వం వాడుకొంది. దీంతో పోతిరెడ్డిపాడు నుండి నీటి విడుదలను నిలిపివేయాలని ఆదేశించిన విషయాన్ని బోర్డు గుర్తు చేసింది. 

ఏ ప్రాజెక్టుకు కేటాయించిన నీటిని అదే ప్రాజెక్టుకు ఉపయోగించుకోవాలని కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. పోతిరెడ్డిపాడుకు 66, హంద్రీ-నీవాకు 5 టీఎంసీలను కేటాయించాలని ప్రతిపాదనలు పంపినట్టుగా ఆయన ఆ లేఖలో గుర్తు చేశారు. రెండు రాష్ట్రాలు తమ ఉత్తర్వులను అమలు చేసేందుకు సహకరించాలని ఆయన ఆ లేఖలో కోరారు.