Asianet News TeluguAsianet News Telugu

టీడీపీలో కోట్ల కుటుంబం చేరికకు ముహూర్తం ఫిక్స్: భారీ ఏర్పాట్లు చేస్తున్న రాఘవేంద్రారెడ్డి

అయితే కోట్ల సుజాతమ్మ డోన్ అసెంబ్లీ నియోజకవర్గంపై పట్టుబడుతుండటంతో కర్నూలు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. గతంలో ఆమె డోన్ అసెంబ్లీ నుంచి పోటీచేసి గెలుపొందారు. అయితే ప్రస్తుతం డోన్ అసెంబ్లీ సీటును డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు ఆశిస్తున్నారు. 

kotla suryaprakash reddy family joins tdp on feb28
Author
Kurnool, First Published Feb 21, 2019, 7:55 AM IST

కర్నూలు: ఎట్టకేలకు కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి సైకిలెక్కేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 28న లక్షలాది మంది సాక్షిగా సీఎం చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకునేందుకు ముహూర్తం ఖరారు చేశారు. 

కర్నూలు జిల్లా కోడుమూరులో భారీ బహిరంగ సభలో కుటుంబ సమేతంగా తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. కోడుమూరులో లక్షమందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తనయుడు రాఘవేంద్రారెడ్డి. 

ఇటీవలే టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం విందులో పాల్గొన్నారు. ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరికపై చర్చించారు. తనకు కర్నూలు పార్లమెంట్, తన భార్య కోట్ల సుజాతమ్మకు డోన్ లేదా ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఇవ్వాలని కోరారు. 

అలాగే తనయుడు రాఘవేంద్రారెడ్డికి ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పెట్టిన షరతులపై చంద్రబాబు నాయుడు అంగీకరించడంతో ఇక సైకిలెక్కేందుకు రెడీ అయ్యారు. 

అయితే కోట్ల సుజాతమ్మ డోన్ అసెంబ్లీ నియోజకవర్గంపై పట్టుబడుతుండటంతో కర్నూలు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. గతంలో ఆమె డోన్ అసెంబ్లీ నుంచి పోటీచేసి గెలుపొందారు. అయితే ప్రస్తుతం డోన్ అసెంబ్లీ సీటును డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు ఆశిస్తున్నారు. 

నియోజకవర్గ ఇంచార్జ్ గా కూడా కేఈ సోదరుడు పనిచేస్తున్నారు. అయితే డోన్ అసెంబ్లీ స్థానాన్ని వదులుకునేందుకు కేఈ కుటుంబం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడం లేదు. అయితే కోట్ల సుజాతమ్మ డోన్ నుంచి పోటీ చేస్తారా లేక ఆలూరు నుంచి పోటీ చేస్తారా అన్న అంశంపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. 

రాజకీయ డిమాండ్లతోపాటు తాను టీడీపీలో చేరే సమయానికి పెండింగ్ లో ఉన్న నియోజకవర్గ అభివృద్ధి పనులు పూర్తి చెయ్యాలని కోరారు. రాష్ట్ర రాజకీయాలను ముఖ్యంగా కర్నూలు జిల్లా రాజకీయాలను ప్రభావితం చెయ్యగల నాయకుడుగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి గుర్తింపు ఉండటంతో ఆయన పెట్టిన షరతులకు చంద్రబాబు అంగీకారం తెలిపారు. 

అందులో భాగంగా కర్నూలు జిల్లాలోని వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు ఎల్‌ఎల్‌సీ కాలువకి పైపులైన్‌ వేయాలని డిమాండ్ చేశారు. దాంతో స్పందించిన చంద్రబాబు వేదవతికి నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవోను కూడా విడుదల చేసింది. అలాగే ఎల్ఎల్ సీ పైపు లైన్, గండ్రేవు ప్రాజెక్టుల శంకుస్థాపనకు కూడా హామీ ఇవ్వడంతో ఇక కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం సైకిలెక్కాల్సిందేనని నిర్ణయించుకున్నారు. 

 
 

Follow Us:
Download App:
  • android
  • ios