కర్నూలు: కేంద్రమాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరేందుకు దాదాపు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నెలాఖరులో సైకిలెక్కనున్నట్లు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తనయుడు రాఘవేంద్రారెడ్డి స్పష్టం చేశారు. 

కోడుమూరులో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఆ సభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరతామని చెప్పుకొచ్చారు. అలాగే తల్లిదండ్రుల పోటీపై కూడా క్లారిటీ ఇచ్చారు రాఘవేంద్రారెడ్డి. 

తన తండ్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కర్నూలు లోక్ సభ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని స్పష్టం చేశారు. అలాగే తన తల్లి సుజాతమ్మ డోన్ అసెంబ్లీ నియోజకవర్గం లేదా ఆలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. 

ఇకపోతే ఎల్లెల్సీ కాలువ పైప్ లైన్ గండ్రేవుల పనులకు చంద్రబాబు ఈ నెలాఖరులో గ్రీన్ సిగ్నల్ ఇస్తారని ఆసమంలో పార్టీలో చేరతామంటూ రాఘవేంద్రారెడ్డి చెప్పుకొచ్చారు. అయితే అతని పోటీ విషయం అనేది త్వరలోనే తేలుతుందన్నారు.