కొత్తపేట: తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి కరోనా సోకింది. దీంతో జగ్గిరెడ్డి  హోం ఐసోలేషన్ లో ఉంటున్నాడు. ఏపీ రాష్ట్రంలో పలువురు ప్రజా ప్రతినిధులు, నేతలకు కరోనా సోకింది.ఇప్పటికే చాలామంది కరోనా నుండి కోలుకొన్నారు.

ఎమ్మెల్యేకు కరోనా సోకిన విషయం తేలడంతో ఆయన క్వారంటైన్ కే పరిమితమయ్యారు. అంతేకాదు తనను కలిసిన వారంతా కూడ క్వారంటైన్ కే పరిమితం కావాలని ఆయన సూచించారు. అంతేకాదు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కరోనా సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన  పార్టీ కార్యక్తరలు, నేతలకు సూచించారు.

రాష్ట్రంలోని పలు పార్టీ నేతలతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులకు కూడ కరోనా సోకింది. విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసులు, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే శివకుమార్, ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి కరోనా సోకింది. ఈ నెల 6వ తేదీన అరకు ఎమ్మెల్యే ఫాల్గుణ, మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు, టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు కరోనా సోకింది.  వీరిలో చాలా మంది కరోనా నుండి కోలుకొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి తగ్గడం లేదు. రాష్ట్రంలో శనివారం నాటికి 4,14,164కి చేరుకొన్నాయి. శనివారం నాడు ఒక్క రోజే 10,548 కరోనా కేసులు నమోదయ్యాయి.