పిఠాపురం : పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్వీఎస్ఎన్ వర్మపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎన్నికల నిబంధనలు అతిక్రమించారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వర్మతోపాటు మరో 30 మందిపై కేసు నమోదు చేశారు కొత్తపల్లి పోలీసులు. 

ఈ నెల 11న ఉప్పాడ హైస్కూల్‌ ఆవరణలోని పోలింగ్ బూత్ లో వర్మ నిబంధనలకు  విరుద్ధంగా కారుతో లోపలికి ప్రవేశించారు. ఆ తర్వాత స్కూల్ గేట్లను మూసివేసి అరగంట పాటు పోలింగ్ కేంద్రంలో గడిపారు. 

ఓటర్లతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా భయభ్రాంతులకు గురి చేశారంటూ వైసీపీ ఆరోపించింది. ఓటర్లతో కలిసి వర్మతీరును నిరసిస్తూ పోలింగ్ బూత్ దగ్గర ఆందోళనకు దిగారు వైసీపీ నేతలు. అనంతరం వైసీపీ ఎన్నికల ఏజెంట్  పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఏజెంట్ ఫిర్యాదుతో కొత్తపల్లి పోలీసులు ఎమ్మెల్యే వర్మతోపాటు మరో 30 మందిపై కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.