కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి షాక్.. వైసీపీ గూటికే మేయర్ స్రవంతి దంపతులు.. సజ్జలతో చర్చలు!
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. శ్రీధర్ రెడ్డి వైసీపీకి దూరమైనప్పటీ నుంచి ఆయనకు మద్దతుగా నిలిచిన నెల్లూరు మేయర్ స్రవంతి.. ఇప్పుడు రూట్ మార్చారు.

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. శ్రీధర్ రెడ్డి వైసీపీకి దూరమైనప్పటీ నుంచి ఆయనకు మద్దతుగా నిలిచిన నెల్లూరు మేయర్ స్రవంతి.. ఇప్పుడు రూట్ మార్చారు. ఆమె వైసీపీలోనే తిరిగి కొనసాగాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మేయర్ స్రవంతి, ఆమె భర్త జయవర్దన్‌లు తాడేపల్లిలో వైసీపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. వివరాలు.. అధికార వైసీపీపై ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే ఆయన వైసీపీకి దూరమయ్యారు. ఆయనకు నెల్లూరు మేయర్, వైసీపీ నాయకురాలు స్రవంతి కూడా మద్దతుగా నిలిచారు. దీంతో ఆమె కూడా వైసీపీ వ్యతిరేక వర్గం జాబితాలో చేరిపోయారు.
అయితే శ్రీధర్ రెడ్డి కంటే ముందే ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరారు. గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరినప్పుడు మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ ఆయనతో పాటు పార్టీలో చేరారు. ఆ తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా టీడీపీ గూటికి చేరారు. అయితే స్రవంతి మాత్రం టీడీపీలో చేరకుండా శ్రీధర్ రెడ్డికి మద్దతిస్తూ వచ్చారు. అయితే తాజాగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డితో స్రవంతి దంపతులకు విభేదాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇరువురి మధ్యవిభేదాలను పరిష్కరించేందుకు శ్రీధర్ రెడ్డి ప్రయత్నాలు చేసినా అవి సఫలం కాలేదు.
ఈ క్రమంలోనే స్రవంతి దంపతులు తిరిగి వైసీపీలోనే కొనసాగాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తో మేయర్ దంపతులు సమావేశమై చర్చలు జరిపినట్టుగా తెలిసింది. తాము పార్టీలో కొనసాగనున్నట్టుగా ఆయనకు చెప్పినట్టుగా సమాచారం. అయితే వీరు త్వరలోనే సీఎం జగన్‌తో సమావేశమయ్యే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.