వైసీపీ నుంచి తాను సైలెంట్‌గా బయటికి వెళ్లిపోవాలని అనుకున్నానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. అయితే వైసీపీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్పారు. 

వైసీపీ నుంచి తాను సైలెంట్‌గా బయటికి వెళ్లిపోవాలని అనుకున్నానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. అయితే వైసీపీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్పారు. తన వ్యక్తిత్వాన్ని అవమానించే విధంగా మాట్లాడుతున్నందుకే స్పందిస్తున్నానని అన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. అధికారపక్షం నుంచి తాను ప్రతిపక్షంలోకి వెళ్లాలని అనుకున్నానని తెలిపారు. అధికార పక్షం నుంచి ప్రతిపక్షానికి వస్తే నమ్మకద్రోహం చేసినట్టా అని ప్రశ్నించారు. కాకాణిని జెడ్పీ చైర్మన్‌గా చేసిన వ్యక్తి ఆనంకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడొచ్చా? అని ప్రశ్నించారు. రాజకీయ మెట్టు ఎక్కించిన ఆనంకు వ్యతిరేకంగా మాట్లాడతావా? అంటూ కాకాణి గోవర్దన్ రెడ్డిపై మండిపడ్డారు. 

జగన్‌తో నడిస్తే భవిష్యత్ ఉండదని అప్పట్లో కాకాణి గోవర్దన్ రెడ్డి చెప్పలేదా? అని ప్రశ్నించారు. కాకాణి గోవర్దన్ రెడ్డి తాను వైఎస్‌కు వీర విధేయుడుని కాదని అంటున్నారని మండిపడ్డారు. జగన్ ఓదార్పు సమయంలో కాకాణి చేసిన పని గుర్తులేదా? అని ప్రశ్నించారు. వైఎస్‌కు కాకాణి గోవర్దన్ రెడ్డి వీరవిధేయుడని చెప్పుకుంటున్నారని.. ఆ రోజు ఆయన పొదలకూరులో వైఎస్సార్ విగ్రహం పెట్టకుండా ఎందుకు ఇబ్బందులు గురిచేశారని ప్రశ్నించారు. వీర విధేయత గురించి కాకాణి మాట్లాడుతుంటే జాలేస్తోందని అన్నారు. తనను తిడితే పదవులు వస్తాయనే తనపై వరుస విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీలో ఉండి చంద్రబాబు నాయుడు కాళ్లకు దండం పెట్టింది కాకాణి కాదా? అని ప్రశ్నించారు. కాకాణి గోవర్దన్ రెడ్డి కోర్టులో ఫైల్స్ చోరీ కేసు జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు. తన సంగతి వదిలేసి నెల్లూరుకు వచ్చిన సీబీఐ సంగతి చూసుకోవాలని ఎద్దేవా చేశారు. 

మంత్రి పదవి ఇప్పించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని విమర్శిస్తే కాకాణికి కోపం వచ్చినట్టుగా ఉందన్నారు. పదవి ఇచ్చిన కంటే ఇప్పించి సజ్జల రామకృష్ణారెడ్డిపైనే కాకాణికి ప్రేమ ఉన్నట్టుందని విమర్శించారు. కాకాణి ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడితే బాగోదని హెచ్చరించారు. 

బోరుగడ్డ అనిల్ ఫోన్ చేసి దుర్భాషలాడుతూ బెదిరించాడని చెప్పారు. కొట్టుకుంటూ తీసుకెళ్తానని అన్నాడని తెలిపారు. అయితే ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి కోటరీ అని తెలిసిందని అన్నారు. 100 మందిని ప్రయోగించిన బెదిరేది లేదని అన్నారు. దేనికైనా సిద్దమని అన్నారు. తనకు ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తే.. సజ్జల రామకృష్ణారెడ్డికి నెల్లూరు నుంచి వీడియో కాల్స్ వెళ్తాయని హెచ్చరించారు. బెదిరింపు కాల్స్‌కు వస్తే భయపడేది లేదన్నారు. 

తనపై కావాలనే కిడ్నాప్ కేసు పెట్టారని ఆరోపించారు. సజ్జల అన్ని విషయాలను పక్కకుపెట్టి.. ఆపరేషన్ నెల్లూరు రూరల్ పెట్టుకుని ఉంటారని విమర్శించారు. కిడ్నాప్ కేసే కాదు.. మర్డర్ కేసు కూడా పెట్టిన కూడా భయపడేది లేదని అన్నారు.