Asianet News TeluguAsianet News Telugu

ఆ ఆడియోను ఇంటెలిజెన్స్ చీఫ్ నాకు పంపారు.. జగనన్న నీ ఫోన్ ట్యాప్ చేస్తే..?: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు.

Kotamreddy sridhar reddy sensational comments on YSRCP
Author
First Published Feb 1, 2023, 12:12 PM IST

ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ..  తన ఫోన్ ట్యాపింగ్ అవుతున్నట్టుగా 4 నెలల ముందే ఓ ఐపీఎస్ అధికారి చెప్పారని అన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ అవుతుందంటే నమ్మలేదని చెప్పారు. సీఎం జగన్‌పై కోపంతో ఆ అధికారి అబద్దం  చెప్పారని భావించానని తెలిపారు. 20 రోజుల ముందు తన ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారం దొరికిందని చెప్పారు. సీఎం జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పకుండా తన ఫోన్ ట్యాపింగ్ చేయరని అన్నారు. 

పార్టీకి విధేయుడిగా ఉన్న తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. బారాషాహిద్ దర్గాకు జగన్ నిధులు మంజూరు చేసిన ఆర్థిక శాఖ  విడుదల చేయడం లేదని చెప్పారు. జగన్ మీద, వైసీపీ మీద తాను ఎప్పుడూ పరుషంగా మాట్లాడలేదని అన్నారు.  అవమానాలు జరిగే చోట తాను ఉండలేనని చెప్పారు. నాయకుడికే నమ్మకం ఉండకపోతే తాను పార్టీలో ఉండి ఎందుకని ప్రశ్నించారు. 

ఆధారాలు బయటపడితే ఇద్దరు ఐపీఎస్ అధికారులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని అన్నారు. ‘‘జగనన్నా.. నీ ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఎలా ఉంటుంది? సజ్జల, విజయసాయిరెడ్డి, ధనుంజయ్‌రెడ్డిల ఫోన్లు ట్యాప్ చేస్తే ఎలా ఉంటుంది?.. మీరు పొరపాటు చేసి ట్యాపింగ్ జరగలేదని అబద్ధాలు చెబుతారా?’’ అని కోటంరెడ్డి  ప్రశ్నించారు. ఆధారాలు బయటపడితే కేంద్రానికి రాష్ట్రం సమాధానం చెప్పాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నికలకు 15 నెలల సమయం ఉందని.. అయితే నిర్ణయం తీసుకున్న తర్వాత నటిస్తూ ఉండటం తనకు ఇష్టం లేదని అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌తో దొంగచాటుగా తన సంభాషణలు వింటున్నారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి కేంద్ర హోం శాఖకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్టుగా చెప్పారు. ఎమ్మెల్యేలవే కాకుండా మంత్రులు, అధికారుల ఫోన్‌లు కూడా ట్యాప్ చేస్తున్నారని విమర్శించారు. హైకోర్టు సీజే ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. 

‘‘కొన్ని రోజుల కిందట నా  బాల్య మిత్రుడితో ఫోన్‌లో మాట్లాడాను. నేను వాడుతున్నది ఐ ఫోన్.. నా ఫ్రెండ్‌ది ఐ ఫోన్.. నేను గానీ, ఆయన గానీ రికార్డు చేసే అవకాశం లేదు. జగన్ గురించి ఎందుకలా మాట్లాడుతున్నారని ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామంజేయులు ఫోన్ చేసి అడిగారు. నా ఫ్రెండ్‌తో నేను మాట్లాడిన వాయిస్‌ ఆడియోను ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు నాకు పంపించారు. ట్యాపింగ్‌కు ఇంతకుమించిన ఆధారాలు ఇంకేం కావాలి?. నా ఫోన్ ట్యాపింగ్ చేయలేదని ప్రభుత్వ పెద్దలు నిరూపిస్తారా? తన ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెబుతారో చెప్పాలి?’’ అని ప్రశ్నించారు. తన మనసు వైసీపీలో ఉండొద్దని చెబుతోందని అన్నారు. తాను టీడీపీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నానని.. అయితే పోటీపై నిర్ణయం చంద్రబాబుదేనని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios