పెళ్లి చేసుకుంటానని, తాళి కట్టే సమయానికి పారిపోలేదు.. ఆదాలకు కోటంరెడ్డి పంచ్....
నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఆ పార్టీ సమన్వయకర్త ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద విరుచుకుపడ్డారు. తనను ఓడించడం అంత సులభం కాదన్నారు. ఆదాలలాగా డ్రామాలు చేయడం తనకు తెలియదని ఎద్దేవా చేశారు

నెల్లూరు : నెల్లూరు వైసిపిలో రాజకీయం కొద్దిరోజులుగా కోటంరెడ్డి చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సొంత పార్టీ, ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వైసిపిని వీడేందుకు కూడా సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ లో అసెంబ్లీ సమన్వయకర్తగా నియమించారు. దీంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆ పార్టీ అసెంబ్లీ సమన్వయకర్తగా నియమితులైన ఆదాల ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఉద్దేశించి వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
ఆయనలాగా డ్రామాలు చేయడం తనకు తెలియదని ఎద్దేవా చేశారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి పెళ్లి చేసుకుంటానని చెప్పి తాళి కట్టే సమయానికి పారిపోయిన వ్యక్తి అని విమర్శలు గుప్పించారు. నెల్లూరులో మంగళవారం నాడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి 2019 ఎన్నికల్లో టిడిపి నుంచి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారని అన్నారు. ఆ తర్వాత నామినేషన్కు ముందు రోజు వైసీపీలోని జంప్ చేశారన్నారు. ఇలాంటి వాళ్ళుకూడా నన్ను విమర్శిస్తారా? అని ఎద్దేవా చేశారు.
నెల్లూరు రూరల్ లో రూ. రెండు, మూడొందల కోట్లు ఖర్చుపెట్టి కోటం రెడ్డి సంగతి తెలిస్తే తేల్చేస్తామని కొంతమంది ప్రగల్భాలు పలుకుతున్నారు. అది అంత ఈజీ కాదు. 2024 ఎన్నికల్లో ఎవరేంటో తేల్చుకుందాం. నెల్లూరు నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం ఎక్కువ. ఇక్కడ గెలవాలంటే ప్రజల మనసుల్లో అభిమానం ఉండాలి. డబ్బులతో పని కదు. వందల కోట్లు పెట్టినంతమాత్రాన విజయం సాధించగలమని అనుకుంటే పొరపాటు. విజయం సాధించడానికి కార్పోరేటర్ల సంఖ్య ముఖ్యం కాదు.
ఎంతమంది ప్రజలు మనల్ని నమ్ముతున్నారు. వారి మనసుల్లో మనం ఉన్నామన్నదే ముఖ్యం. చివరి రోజు దాకా అధికార పార్టీలో ఉండి ఆఖరిలో పార్టీ మారే స్వభావం కొందరు రాజకీయ నాయకులకు ఉంటుందని అలాంటి స్వభావం నాది కాదని ఆయన అన్నారు. అవమానించిన చోట ఉండలేకపోయాను అన్నారు. జీవోలు ఇచ్చినా నిధులు రాలేదని.. చేయాల్సిన పనుల కోసం ప్రజలు ప్రశ్నిస్తుంటే ఏం సమాధానాలు చెప్పాలో తెలియలేదని.. దీంతోనే విధిలేక బయటకి వచ్చేసానని చెప్పుకొచ్చారు.
2024లో ప్రజలు ఏ తీర్పు ఇచ్చిన శిరసావహిస్తానని వారే న్యాయ నిర్ణయితలని అన్నారు. ఓ సైనికుడిలా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. గౌరీ, మొయిళ్ల సురేష్ రెడ్డి మీద తాను విమర్శలు చేయబోనని అన్నారు. అది వారి విచక్షణకే వదిలేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. అమరావతి రైతుల పాదయాత్ర నెల్లూరుకు వచ్చిన సమయంలో.. వారికి భోజనాలు లేక నెల్లూరులోని ఓ కళ్యాణమండపంలో ఉన్నారు. ఆ సమయంలో నేను వెళ్లి పరామర్శించడం నేరమవుతుందా? అని ప్రశ్నించారు. నెల్లూరులోని పలువురు మహిళా నాయకురాళ్లు అంతకుముందే కోటంరెడ్డికి తమ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తామంతా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితోనే ఉంటామని స్పష్టం చేశారు.