టూరిజం హబ్‌గా కొండపల్లి
‘కొండపల్లి బొమ్మల కళను ప్రోత్సహించింది శ్రీకృష్ణదేవరాయలు. ఆయన స్పూర్తితో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కొండపల్లి హస్తకళాకారులను ప్రోత్సహించారు.’
టూరిజం హబ్‌గా కొండపల్లి
హస్తకళాకారులకు అన్ని విధాలా తోడ్పాటు అందించి పూర్వ వైభవాన్ని తీసుకోస్తామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లిలో ఉన్న కొండపల్లి బొమ్మల తయారీ కేంద్రాలను ఆమె సందర్శించారు. కళాకారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. హస్తకళాకారుల సమస్యలు తెసుకునేందుకే తాను కొండపల్లికి వచ్చానని తెలిపారు. కళాకారులు చెప్పిన ప్రతి సమస్యను తీర్చేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. బొమ్మల తయారీకి ఆసక్తి ఉన్నవారికి ఇచ్చే శిక్షణా కార్యక్రమం కాలపరిమితిని ఏడాదికి పెంచుతామని తెలిపారు. హస్త కళాకారులకు బొమ్మల తయారీకి కావాల్సిన పనిమూట్లను అందుబాటులో ఉండే ధరకే దక్కేలా చూడడంతో పాటు కళాకారులకు ఉచితంగా ఇళ్ల పంపిణికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. కొండపల్లి బొమ్మల కళను ప్రోత్సహించింది శ్రీకృష్ణదేవరాయలన్నారు. ఆయన స్పూర్తితో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కొండపల్లి హస్తకళాకారులను ప్రోత్సహించారని గుర్తుచేశారు. మహిళలు కూడా కొండపల్లి బొమ్మల తయారీలో భాగమవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. హస్తకళాకారులకు అన్ని విధాల తోడుగా నిలబడి కొండపల్లి బొమ్మలకు అంతర్జాతీయ మార్కెట్‌ను పెంచుతామని హామీ ఇచ్చారు. అధికారులు, నాయకులు లేపాక్షి కేంద్రాల్లో బొమ్మలను కొనుగోలు చేసి సత్కార కార్యక్రమాల్లో బహూకరించాలని కోరారు. కొండపల్లిని టూరిజం హబ్ మార్చి ఇక్కడి కొండపల్లి బోమ్మల కొనుగోలును పెంచుతామని చెప్పారు.
మంత్రి మానవతా హృదయం: కొండపల్లి పర్యటనలో మంత్రి మానవతా హృదయం చాటుకున్నారు. అనారోగ్యంతో బాధ పడుతున్న పేద కళాకారుడికి పరిస్థితి చూసి చలించిపోయారు. బాధితుడికి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించారు. దాంతో పాటు కళాకారుడికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.