గుంటూరు: బాధ్యత కలిగిన మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు చాలా దురదృష్టకరమని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. రాజకీయాలే వైసీపీ అజెండా  అని...కరోనా వ్యాప్తికి వైసీపీ నేతలే కారణమని మండిపడ్డారు. రాష్ట్రానికి పట్టిన డేంజరస్ వైరస్ వైసీపీ అని విమర్శించారు. పబ్లిసిటీ కోసం సామాన్యుల జీవితాలతో ఆటలు ఆడవద్దంటూ జగన్ ప్రభుత్వానికి రవీంద్ర 
సూచించారు.  

''ప్రతి పేద కుటుంబానికి రూ.5వేలు ఇవ్వాలి. మంత్రులుగా సమస్యలపై అడ్రస్ చేయకుండా రాజకీయాలు చేస్తున్నారు. పబ్లిసిటీ, హంగులు, ఆర్భాటాల కోసం సామాన్యుల జీవితాలతో ఆటలు ఆడుకోవద్దు. ఇదేరకంగా వ్యవహరిస్తే ప్రజల చేతుల్లో చెప్పుదెబ్బలు తింటారు. అతిగా మాట్లాడితే ప్రజలే బుద్ధి చెబుతారు'' అంటూ వైసిపి నాయకులపై రవీంద్ర ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

''కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. బాధ్యతగల మంత్రులు రాజకీయాలు చేయడమే అజెండాగా పెట్టుకున్నారు. కరోనా వ్యాప్తికి టీడీపీ స్లీపర్ సెల్స్ ను వదిలారని మోపిదేవి వెంకటరమణ మాట్లాడటం అత్యంత హేయం. రాజకీయ దురుద్దేశంతో మాట్లాడినట్లుగా ఉంది. ఈ వ్యాఖ్యలు చాలా బాధాకరం'' అని విమర్శించారు. 

''కరోనా కేసులు పెద్దఎత్తున బయటపడుతున్నాయి. గుంటూరులో పరిస్థితి తీవ్రతకు వైసీపీ ఎమ్మెల్యే కారణం కాదా. కర్నూలు, శ్రీకాకుళంలో కేసులకు వైసీపీ నేతల వ్యవహారం కారణం కాదా. 12 జిల్లాలు కరనాను ఫేస్ చేస్తున్నాయి. విజయవాడ, గుంటూరు, కర్నూలులో ఏవిధంగా కరోనా వ్యాపిస్తోందో మీకు తెలియదా. వైసీపీ నేతలు ఇందుకు కారణం కాదా. బాధ్యతగల మంత్రిగా ఉన్నమోపిదేవి గుంటూరు రెడ్ జోన్ ప్రాంతంలోకి వెళ్లి ఈ విధంగా మాట్లాడగలరా'' అని ప్రశ్నించారు. 

''అధికారులు కూడా వైసీపీ వల్ల కరోనా బారిన పడుతున్నారు. విజయసాయిరెడ్డి అన్ని ప్రాంతాలకు తిరుగుతూ కరోనాను వ్యాపింపజేస్తున్నారు. వైసీపీ నేతల మీటింగ్ లు, ఊరేగింపుల వల్ల కరోనా వ్యాప్తి చెందుతోంది. శ్రీకాళహస్తిలో మధుసూదన్ రెడ్డి 40 ట్రాక్టర్లతో ర్యాలీ పెట్టడం వల్ల అధికారులకు కూడా కరోనా వచ్చింది. నగరిలో రోజా పూలు చల్లించుకున్నది వాస్తవం కాదా. వీటివల్ల కరోనా వ్యాప్తి చెందడం లేదా'' అని అడిగారు. 

''సాక్షాత్తు వైసీపీ ఎంపీ ఇంట్లో 6 పాజిటివ్ కేసులు రావడం మీ చేతగానితనం, వైఫల్యం కాదా. రాజ్ భవన్ లో 4 కేసులు వచ్చాయంటే రాష్ట్రానికి అవమానం కాదా. సీఎంకు సీరియస్ నెస్ లేదు. పారాసెట్మాల్, బ్లీచింగ్, ఇట్ కమ్స్, ఇట్ గోస్ అంటూ మాట్లాడారు. దీనివల్లే రాష్ట్రం ఈ పరిస్థితికి వచ్చింది'' అని రవీంద్ర మండిపడ్డారు. 

''కరోనా కేసులు, పరీక్షల విషయంలో వాస్తవాలను దాచిపెడుతున్నారు. గుంటూరులో హోటల్ అధినేత సుభాని చనిపోతే దాచే ప్రయత్నం చేశారు. రాజకీయాల కోసం, ఎన్నికల కోసం వైసీపీ నేతలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ మంత్రులు, నేతలు రాష్ట్రాల సరిహద్దులు, జిల్లాల సరిహద్దులు ఇష్టానుసారంగా దాటుతున్నారు. రాష్ట్రానికి పట్టిన డేంజరస్ వైరస్ వైఎస్సార్ పార్టీ'' అని విమర్శించారు. 

''డాక్టర్లకు, పారిశుద్ధ్య సిబ్బందికి మాస్క్ లు లేవు. అడిగిన వారిని సస్పెండ్ చేశారు. లాక్ డౌన్ అవసరం లేదని సలహా ఇచ్చిన పరిస్థితి జగన్ ది. వైసీపీ నేతలు లిక్కర్, మట్టిని, ఇసుకను అమ్ముకుంటూ కోట్లు గడిస్తున్నారు. సమస్యలను గాలికి వదిలేసి డబ్బు సంపాదించే పనిలో ఉన్నారు'' అని ఆరోపించారు.  

''ఇళ్ల స్థలాల పేరుతో మడ అడవులను నరికివేస్తున్నారు. దీంతో కాకినాడ సంరక్షణ ప్రమాదం పడే పరిస్థితి నెలకొంది. వేలమంది మత్స్యకారులు జీవనాధారం కోల్పోతుంటే మోపిదేపి ఏం చేస్తున్నారు'' అని రవీంద్ర ప్రశ్నించారు.