సత్తెనపల్లి టీడీపీ ఇన్ఛార్జీగా కన్నా లక్ష్మీనారాయణ.. కోడెల శివరామ్ ఆగ్రహం, అనుచరులతో భేటీ
సత్తెనపల్లి టీడీపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ బరిలో దిగుతారని ఆ పార్టీ అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో కోడెల శివరాం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వచ్చే ఏపీ ఎన్నికల్లో పల్నాడు జిల్లా సత్తెనపల్లి టీడీపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ బరిలో దిగుతారని ఆ పార్టీ అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో దివంగత స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం అప్రమత్తమయ్యారు. దీనిలో భాగంగా తన అనుచరులతో ఆయన సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారు.
కాగా.. రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత వున్న సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ పదవి కోసం కోడెలశివరాం, మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు , శౌరయ్య, మల్లిబాబు పోటీ పడ్డారు. అయితే మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వైపే టీడీపీ నాయకత్వం మొగ్గుచూపింది. 2014, 2019 ఎన్నికల్లో ఈ స్థానం నుండి కోడెల శివప్రసాదరావు టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేశారు. 2014లో సత్తెనపల్లి నుండి కోడెల శివప్రసాదరావు విజయం సాధించి నవ్యాంధ్ర తొలి స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు.
ALso Read: అంబటిపై పోటీకి కన్నా: సత్తెనపల్లి టీడీపీ ఇంచార్జీగా మాజీ మంత్రి నియామకం
అయితే 2019 ఎన్నికల్లో కోడెల శివప్రసాదరావు వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధి అంబటి రాంబాబు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకే కోడెల ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి ఈ నియోజకవర్గానికి టీడీపీ ఇంచార్జీ లేరు. దీంతో ఈ పదవి కోసం నేతలు పోటీ పడ్డారు. అయితే ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణను సత్తెనపల్లి ఇంచార్జీగా నియమించింది హైకమాండ్.