ఇటీవల వైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేసారంటూ సినీనటుడు చిరంజీవిపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి, వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని యూటర్న్ తీసుకున్నారు. తాజాగా చిరంజీవిని పొగుడుతూ ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు.
గుడివాడ : మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇటీవల చిరంజీవి తమ ప్రభుత్వం గురించే ఏదో మాట్లాడాడంటూ వైసిపి నాయకులు ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంత్రి కొడాలి నాని కూడా పకోడి గాళ్లు కూడా తమకు సలహా ఇస్తున్నారంటూ చిరంజీవిపై నాని విరుచుకుపడ్డారు. అయితే తాజాగా చిరంజీవి విషయంలో నాని యూటర్న్ తీసుకున్నారు.
గుడివాడలో చిరంజీవి అభిమానులు ఏర్పాటుచేసిన పుట్టినరోజు వేడుకల్లో కొడాలి నాని పాల్గొని కేక్ కట్ చేసారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి ఫోటోలతో కూడిన ప్లకార్డులు అభిమానులు ప్రదర్శించారు. చిరంజీవి భర్త్ డే కేక్ కట్ చేసి అభిమానులకు తిరిపించారు కొడాలి నాని.
వీడియో
ఈ సందర్భంగా వైసిపి ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ... చిరంజీవిని తాను ఎప్పుడూ విమర్శించలేదని అన్నారు. తమకు ఇచ్చినట్లే సినీ ఇండస్ట్రీలో డ్యాన్సులు, నటన చేతగాని పకోడీగాళ్ళకు సలహాలు ఇవ్వాలనే చిరంజీవికి చెప్పాను... అంతేగానీ ఆయనను పకోడిగాడు అనలేదన్నారు. తాను చిరంజీవిని విమర్శించానని జనసేన, టిడిపి నాయకులు తప్పుడు ప్రచారం చేసారని... దమ్ముంటే తాను తిట్టినట్లు నిరూపించాలని కొడాలి నాని చాలెంజ్ చేసారు.
Read More టీటీడీ ఛైర్మన్‌కు ‘‘పుష్ప’’ సినిమా చూపించాలేమో.. కరుణాకర్ రెడ్డిపై బండి సంజయ్ సెటైర్లు
చిరంజీవి గురించి తాను ఏం మాట్లాడానో ఆయనను, అభిమానులకు తెలుసు... తామంతా క్లారిటీగానే వున్నామన్నారు. రాజకీయంగా చిరంజీవి విమర్శిస్తే ఏం జరుగుతుందో తనకు తెలుసు... అయినా ఎలా మాట్లాడతానని అన్నారు. చిరంజీవికి ,తమకు మద్య అగాధం సృష్టించాలని టిడిపి, జనసేన కుట్రలు పన్నుతోందని... అందులో భాగంగానే విమర్శించినట్లు తప్పుడు ప్రచారం చేసారన్నారు. చిరంజీవి అభిమానుల ముసుగులో కొందరు గుడివాడ రోడ్లమీద దొర్లి ఏదో జరిగిపోయిందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసారని కొడాలి నాని అన్నారు.
తాను శ్రీరామ అన్నా టిడిపి, జనసేనల నాయకులకు బూతు మాటలుగా వినపడతాయన్నారు. అలాగే చిరంజీవి గురించి తన మాటలను వక్రీకరించారని అన్నారు. ఎవరి జోలికి వెళ్ళని పెద్దయన చిరంజీవిని విమర్శించే సంస్కారహీనుడును కాదన్నారు. గతంలో ప్రజారాజ్యం అధినేతగా గుడివాడకు వచ్చిన చిరంజీవి తన కార్యాలయం మీదుగా ర్యాలీగా వెళ్లారని... అప్పుడు తాను చేతులెత్తి నమస్కారం పెట్టానని అన్నారు. ఇప్పటివరకు అనేక సందర్భాల్లో చిరంజీవిని కలిసానని అన్నారు. పెద్దమనిషిలా గౌరవిస్తూ ఆయన చెప్పే సూచనలు కూడా పాటిస్తామని కొడాలి నాని పేర్కొన్నారు.
అయితే ముఖ్యమంత్రి జగన్, తమగురించి మాట్లాడితే ఎంతటి వారినైనా చీల్చి చెండాడుతామని నాని అన్నారు. సినీ ఇండస్ట్రీలో శిఖరాగ్రాన ఉన్న చిరంజీవికి డాన్సులు, యాక్షన్ రాదా... అవి రాని పకోడీ గాళ్లకు సలహాలు ఇవ్వాలని చిరంజీవిని కోరానని అన్నారు. చిరంజీవిని ఉద్దేశించి విమర్శలు చేయలేనని నాని తెలిపారు. తన వెంట ఉన్న వ్యక్తుల్లో 60శాతం మంది చిరంజీవి అభిమానులే వుంటారని కొడాలి నాని తెలిపారు.
