తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై (Chandrababu Naidu) ఏపీ మంత్రి కొడాలి నాని (Kodali Nani)  మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. సినీ పరిశ్రమలో సమస్యలకు చంద్రబాబు నాయుడే కారణమని ఆరోపించారు. 

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై (Chandrababu Naidu) ఏపీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. సినీ పరిశ్రమలో సమస్యలకు చంద్రబాబు నాయుడే కారణమని ఆరోపించారు. పవన్ కల్యాణ్ చిత్రం బీమ్లా నాయక్‌ను తొక్కేశారని విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. భీమ్లా నాయక్‌ (Bheemla Nayak) సినిమాను సీఎం వైఎస్‌ జగన్‌ తొక్కేశారు అనే కలరింగ్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ శత్రువులు, మిత్రుల గురించి ఆలోచించరని.. ప్రజల గురించే ఆలోచిస్తారని అన్నారు. 

ఎవరి సినిమా అయినా ప్రభుత్వానికి ఒక్కటేనని కొడాలి నాని చెప్పారు. బ్లాక్‌టిక్కెట్ల పేరుతో దోచుకుందాము అనుకుంటే కుదరదని అన్నారు. చంద్రబాబు కోసం ఎల్లో మీడియా.. సీఎం వైఎస్‌ జగన్‌పై విష ప్రచారం చేస్తోందని ఆరోపించారు. టిక్కెట్‌ ధరలకు సంబంధించి న్యాయ పరమైన అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చూస్తోందని చెప్పారు. త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 

సినీ పరిశ్రమను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని కొడాలి నాని విమర్శించారు. సినిమా ఆడకపోతే పవన్ కల్యాణ్‌కు నష్టం ఉండదని అన్నారు. పవన్‌కు రెమ్యూనరేషన్ అందుతుందని చెప్పారు. పవన్ కుటుంబం మొత్తం ఈ స్థాయిలో ఉండటానికి కారణం చిరంజీవి అన్నారు. చిరంజీవి ప్రతి ఒక్కరికి ఎంతో గౌరవం ఇస్తారని అన్నారు. వంగి వంగి నమస్కారాలు అని పవన్ కల్యాణ్ మాట్లాడటం సరైనదైనా అని ప్రశ్నించారు. నర్సాపురం మీటింగ్‌లో పవన్ కళ్యాణ్ సొంత అన్న చిరంజీవిని అవమానించేలా మాట్లాడటం సరికాదని అన్నారు. 

చిరంజీవిని సీఎం జగన్ ఎంతో గౌరవిస్తారని చెప్పారు. గతంలో చిరంజీవి సతీసమేతంగా ముఖ్యమంత్రి ఇంటికి వచ్చిన విషయాన్ని పవన్ మర్చిపోయాడా అని ప్రశ్నించారు. సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు సీఎం జగన్.. చిరంజీవిని ఆహ్వానించారని చెప్పారు. సీఎం జగన్ ఇంట్లో ఇచ్చిన ఆతిథ్యం గురించి చిరంజీవి స్వయంగా చెప్పిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. జగన్ మిత్రుడైన నాగార్జున సినిమాకైనా.. రాజకీయ ప్రత్యర్థి అయిన పవన్ కల్యాణ్ సినిమాకైనా ఒక్కటే రూల్స్ ఉంటాయని చెప్పారు. ప్రజలను లూటీ చేసే ప్రయత్నాలకు ప్రభుత్వం అంగీకరించదని చెప్పారు. 

సీఎం కూడా ఇంట్లో నుంచి నడుచుకుంటూనే క్యాంపు కార్యాలయానికి వెళ్తారని అన్నారు. చంద్రబాబు లాంటి వాళ్లు రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఉచ్చులో పడొద్దని పవన్‌కల్యాణ్‌ను కోరుతున్నట్టుగా చెప్పారు. చంద్రబాబు ఎన్టీఆర్ వారసులనే తొక్కేయాలని చూశారని ఆరోపించారు. భారతి సిమెంట్‌పై చంద్రబాబుతో చర్చకు సిద్దమేనని.. హెరిటేజ్‌ గురించి చర్చకు సిద్దమా అని కొడాలని నాని సవాలు విసిరారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పారు.