విజయవాడ: కాటికి కాళ్లు చాపిన వయస్సుిలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తప్పు విమర్శలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.  

సంక్రాంతి పండుగ చేసుకోవద్దని ప్రజలకు చెప్పడానికి చంద్రబాబు ఎవరని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు సంక్రాంతి పండుగ చేసుకోకపోతే ప్రజలు చేసుకోకూడదా అని ఆయన ప్రశ్నించారు. 

తెలుగు ప్రజలకు అత్యంత ముఖ్యమైన సంక్రాంతి పండుగను చంద్రబాబు రాజకీయాలకు వాడుకోవడం దౌర్భాగ్యమని మరో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు తమ ప్రభుత్వానికి లభిస్తున్న ఆదరణ చూడలేక చంద్రబాబు రగిలిపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 

సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై భోగి మంటలు వేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని చెప్పారు. ఈ ఏడాది అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలే దానికి నిదర్శనమని ఆయన అన్నారు.

రాష్ట్ర ప్రజలు సంతోషంగా సంక్రాంతి సంబరాలు చేసుకుంటుంటే చంద్రబాబు, పవన్ కల్యామ్ మాత్రం అమరావతి ముసుగులో అభూత కల్పనలతో కుట్రలు చేస్తున్నారని వెల్లంపల్లి విమర్శించారు. ప్రజలను తప్పు దోవ పట్టించాలని చూస్తున్నారని ఆయన అన్నారు. 

పండుగ జరుపుకోవద్దని పిలుపునిచ్చే చంద్రబాబు వంటి నాయకుడిని తాను ఎక్కడా చూడలేదని ఆయన అన్నారు. చంద్రబాబు ఒక్క మాట మీద నిలబడలేని వ్యక్తి అని మరోసారి రుజువైందని ఆయన అన్నారు.