విజయవాడ: పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని కిరణ్ కౌర్ అనే  యువతి గత ఐదు రోజులుగా కన్పించడం లేదని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

రాజస్థాన్‌‌కు చెందిన వ్యాపారి కసర్‌సింగ్  విజయవాడలోని సింగ్‌ నగర్‌లో కుటుంబసభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. కసర్ సింగ్ కూతురు కిరణ్ కౌర్.  అయితే ఆమెకు వివాహం చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకొన్నారు.

కానీ, ఆమె ఇప్పుడే వివాహం చేసుకోవడానికి ఒప్పుకోలేదు. దీంతో కలత చెందిన ఆమె  ఇంటి నుండి వెళ్లిపోయిందని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదు రోజుల క్రితమే ఇంటి నుండి వెళ్లిపోయిన కిరణ్‌ కౌర్ ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదని కుటుంబసభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు యువతి అదృశ్యంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సింగ్‌నగర్ సీఐ జగన్మోహనరావు తెలిపారు. యువతి స్నేహితులను  ఆరా తీస్తే  ఎటువంటి ప్రేమ వ్యవహారం లేదని చెప్పారని  ఆమె గుర్తు చేశారు. కేవలం వివాహం ఇష్టం లేకే ఇంటి నుంచి వెళ్ళిపోయి ఏదైనా ప్రైవేట్‌ హాస్టల్‌లో తలదాచుకొని ఉంటుందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.