Asianet News TeluguAsianet News Telugu

రైతులేమైనా దేశద్రోహులా... సంకెళ్లతో బందించి అవమానిస్తారా?: జగన్ పై అచ్చెన్న సీరియస్

రాష్ట్రంలోని ప్రతి అన్నదాతను దళారుల ముసుగులో ఉన్న వైసీపీ నేతలు దోచుకుంటున్నారని ఏపీ టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు.  

kinjarapu atchannaidu serious on cm ys jagan  akp
Author
Amaravati, First Published Jul 14, 2021, 12:44 PM IST

అమరావతి: వ్యవసాయాన్ని, రైతాంగాన్ని సమూలంగా నాశనం చేయడమే లక్ష్యంగా రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలన సాగుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. వైసిపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతు వ్యతిరేక విధానాలతో అన్నదాతలను నట్టేట ముంచుతున్నారన్నారు. అన్యాయాన్ని ప్రశ్నించిన రైతులను దేశ ద్రోహుల్లా సంకెళ్లతో బందించి అవమానిస్తున్నారని అచ్చెన్న ఆందోళన వ్యక్తం చేశారు. 

''ఏడాదిగా ధాన్యం బకాయిలు చెల్లించలేదు. ఖరీఫ్ సీజన్ ఆరంభమైనా విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేవు. అప్పుల కోసం మోటార్లకు మీటర్లు పెట్టి.. రైతు మెడకు ఉరితాడు బిగించారు. గిట్టుబాటు ధరల పేరుతో హడావుడి చేయడం తప్ప.. రాష్ట్రంలో ఏ పంటకూ మద్దతు ధర ఇచ్చిన పాపాన పోలేదు. ప్రతి రైతునూ దళారుల ముసుగులో ఉన్న వైసీపీ నేతలు దోచుకున్నారు'' అని ఆరోపించారు. 

''సబ్సీడీతో అందాల్సిన వ్యవసాయ పరికరాలు, ఎరువులను రద్దు చేసి అన్నదాతల నడ్డి విరుస్తున్నారు. బ్యాంకుల్లో రైతులకు రుణాలు ఇవ్వడం లేదు.  రైతు భరోసా పేరుతో రైతు భక్షక పాలనకు శ్రీకారం చుట్టారు. ఆర్బీకేలకు రంగులు వేయడానికి  చేసిన వ్యయం కూడా రైతు సంక్షేమం కోసం ఖర్చు చేయడం లేదు. రైతు భరోసా కేంద్రాలు ఎరువులు,  విత్తనాలు లేకుండా అలంకార ప్రాయంగా మారాయి. కర్నూలు, కడపలో వేలాది ఎకరాలకు నీరందించే కేసీ కాలువకు రెండేళ్లుగా మరమ్మతులు నిర్వహించడం లేదు. పంట కాలువల్లో నీరు పారే పరిస్థితి లేకుండా పోయింది'' అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. 

read more  25 వేల కోట్ల అప్పును దాచారు.. డేటా మీరు ఇవ్వకుంటే, ఎన్నో దారులు: బుగ్గనకు పయ్యావుల కౌంటర్

''తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పక్కాగా అమలైన పంటల బీమా, ఇన్ పుట్ సబ్సీడీ, ఉచిత విత్తనాల పంపిణీ, సూక్ష్మ పోషకాల పంపిణీ, రైతు రథం ట్రాక్టర్లు, యంత్ర పరికరాల పంపిణీ, డ్రిప్ ఇరిగేషన్ ను జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. రెండేళ్లలో ఒక్క రైతుకూ సబ్సీడీపై యంత్ర పరికరాలు గానీ, సూక్ష్మపోషకాలు గానీ అందించిన దాఖలాల్లేవు. రైతులకిచ్చే సంక్షేమ పథకాలను నిలిపేస్తున్నారు'' అని పేర్కొన్నారు. 

''పంటల బీమా ప్రీమియంపై చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన ప్రభుత్వం వ్యవహరించింది. ప్రీమియం చెల్లించకుండానే నాడు అసెంబ్లీలో అబద్ధం చెప్పి.. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో నిలదీసిన తర్వాత రాత్రికి రాత్రి రూ.590 కోట్లు విడుదల చేశారు. దీని వల్ల లక్షలాది మంది రైతులు బీమా సొమ్మును కోల్పోయారు'' అని గుర్తుచేశారు. 

''ఉచితంగా బోర్లు వేయిస్తామన్న ప్రభుత్వం.. రెండేళ్లలో ఎన్ని బోర్లు వేసిందో సమాధానం చెప్పాలి. అమూల్ డైరీ కోసం రాష్ట్రంలోని పాడి రైతుల ఆధ్వర్యంలో నడుస్తున్న డైరీలను మూసేస్తున్నారు. అన్నదాతలపై అక్కసు చూపిస్తున్న.. వైసీపీ ప్రభుత్వాన్ని రైతులంతా ఏకమై.. మూకుమ్మడిగా ఛరకాతో కొట్టే రోజులు దగ్గర పడ్డాయి'' అని అచ్చెన్న హెచ్చరించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios