విశాఖ పట్నంలో కలకలం సృష్టించిన రాకేష్ కిడ్నాప్ కేసును పోలీసులు పన్నెండు గంటల్లో చేధించారు. విశాఖ, వెంకోజీపాలెం అయ్యప్ప ఆలయం వద్ద మంగళవారం ఉదయం కిడ్నాపైన రాకేష్ ను పోలీసులు పన్నెండు గంటల్లో పట్టుకుని ఆరుగురిని అరెస్ట్ చేశారు. 

కిడ్నాప్ చేసిన జంగిని పిచ్చయ్య, చెన్నాయి ప్రసాద్, బెహరా వెంకటేష్, పుక్కల్ల కిరణ్ కుమార్, మరుపల్లి తరుణ్ కుమార్, బంగారి శంకర్ లను అదుపులోకి  తీసుకున్నట్టు ఎంవీపీ సి.ఐ.రమణయ్య బుధవారం తెలిపారు. 

ఎంవీపీ కాలనీ సెక్టార్ -4 కు చెందిన శ్రీరాముని రాకేష్ మామ పిచ్చయ్యను మధ్యవర్తిగా పెట్టి తూర్పుగోదావరి జిల్లా కడియంకు చెందిన ఓ వ్యక్తికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 18లక్షలు తీసుకున్నాడు. నెలలు గడిచినా ఉద్యోగం చూపించలేదు. దీంతో రాకేష్ ను ఆ వ్యక్తికి అప్పజెప్పేస్తే తన మీద ఒత్తిడి ఉండదని పిచ్చయ్య నిర్ణయించుకున్నాడు. 

దీంతో పథకం ప్రకారం మంగళవారం ఉదయం అయ్యప్ప పూజకోసం వెంకోజీపాలెం రమ్మని రాకేష్ ను పిలిపించాడు. మరో ఐదుగురు అనుచరుల సాయంతో రాకేష్ రాగానే అందరూ కలిసి కారులో అతన్ని బలవంతంగా ఎక్కించుకొని కడియం బయల్దేరారు. గుడి కని వెళ్లిన రాకేష్ ఎంతసేపటికీ రాకపోవడంతో సోదరుడు సాయిరామ్ ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతోపాటు నక్కపల్లి టోల్ గేట్ దాటాక తనను కారులో తీసుకళుతున్న విషయాన్ని రాకేష్ కుటుంబసభ్యులకు సమాచారమిచ్చాడు. 

వారు వెంటనే ఈ సమాచారాన్ని తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు అందించారు. వారు వెంటనే రాకేస్ నెంబర్ ను ట్రేస్ చేస్తూ జీపీఎస్ ద్వారా కారు వెళుతున్న గమ్యాన్ని కనుక్కున్నారు. కారు సాయంత్రం కడియం చేరుకోగానే స్థానిక పోలీసుల సాయంతో పట్టుకున్నారు. నిందితులను ఆ రాత్రి విశాఖ తరలించి రిమాండ్ విధించారు.