హైదరాబాద్: కియా మోటార్స్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా పెనుకొండలో గల ప్లాంట్ లో తన ఆపరేషన్స్ ను సస్పెండ్ చేసింది. కరోనా వైరస్ ముప్పు నేపథ్యంలో తర్వాతి నోటీసు జారీ చేసేవరకు కార్యాలయాలన్నీ మూసి ఉంటాయని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. 

కోవిడ్ 19 విస్తరిస్తున్న అసాధారణమైన పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తమ వినియోగదారులు, ఉద్యోగులు, కార్మికులు, భాగస్వాముల సంక్షేమం కోసం సత్వరమే తమ ఆపరేషన్స్ ను ఆపేయాలని నిర్ణయించినట్లు కియా మోటార్స్ ఇండియా తన ప్రకటనలో తెలిపింది. 

తదుపరి నోటీసు ఇచ్చేవరకు పెనుకొండలోని కంపెనీ కార్యాలయాలు పనిచేయడం ఆపేస్తాయని తెలిపారు. ఫోన్ల ద్వారా, డిజిటల్ చానెల్స్ ద్వారా కస్టమర్లకు అందుబాటులో ఉంటామని చెప్పారు. ముందు జాగ్రత్తలు తీసుకుంటూనే అత్యవసరమని భావించిన కస్టమర్లకు డెలివరీలు, సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

లాక్ డౌన్ గురించి కియా మోటార్స్ యజమానులకు సమాచారం ఇచ్చామని, దాన్ని వారు పాటిస్తున్నారని అధికారులు అంటన్నారు. ఫిబ్రవరిలో ప్లాంట్ కు వచ్చిన ఎనిమిది మంది కొరియా జాతీయులు క్వారంటైన్ లో ఉన్నారు.