ధర్మవరం: ధర్మవరం నియోజకవర్గం బాధ్యతలు పరిటాల సునీత కుటుంబానికి అప్పగించడంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆనియోజకవర్గ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. ఎవడు పడితే వాడు వచ్చి రాజకీయాలు చేసేందుకు ఇదేమైనా కనపర్తా అంటూ నిలదీశారు. 

ధర్మవరం నియోజకవర్గానికి డబ్బు కోసం వస్తున్నారా లేక ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు వస్తున్నారా అంటూ నిలదీశారు. గత ఐదేళ్లలో ధర్మవరం నియోజకవర్గానికి ఎవరెవరో వస్తుంటారు పోతుంటున్నారని ఒక్కరు కూడా ప్రజల సమస్యలపై పోరాటం చేయడం లేదని విమర్శించారు. 

రాజకీయం అంటే ఆదాయవనరు కాదని ఒక బాధ్యత అంటూ చెప్పుకొచ్చారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వరదాపురం సూరి ప్రజలకు ఏం చేశారని నిలదీశారు. ఆయన వెళ్లిపోయారు మళ్లీ ఇప్పుడు పరిటాల కుటుంబం వస్తుందంట అంటూ వ్యంగ్యంగా స్పందించారు. 

పరిటాల కుటుంబీకులు వచ్చి ధర్మవరం నియోజకవర్గంలో శాంతి స్థాపన చేస్తారట అంటూ సెటైర్లు వేశారు. ధర్మవరం నియోజకవర్గంలో జరిగే హత్యలకు ఫ్యాక్షన్ లకు కారణం ఎవరో అందరికీ తెలుసు అన్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు హిట్ లిస్ట్ అనౌన్స్ చేశారని మరి ఇప్పుడు అదే హిట్ లిస్ట్ తో వస్తారా అంటూ ప్రశ్నించారు. 

నియోజకవర్గం వచ్చి హడావిడి చేస్తామంటే కుదరదన్నారు. ప్రజలకు అనుకూలంగా ఉండేవారే నియోజకవర్గంలో అడుగుపెట్టాలని అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే చూస్తు ఊరుకోబోమన్నారు. మీలాంటి హడావిడి బ్యాచ్ రాజకీయాలు ఇక్కడ చెల్లవన్నారు. 

అలాంటి వారిని ఎందరినో ఈ ధర్మవరం నియోజకవర్గం కాలగర్భంలో కలిపేసిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. మీకాళ్లకింద ప్రజలు ఎవరూ బతకరని ప్రజల కాళ్లు పట్టుకునేందుకు సిద్ధంగా ఉంటేనే ధర్మవరం నియోజకవర్గంలో అడుగుపెట్టాలని హెచ్చరించారు. 

ప్రజలకు కాళ్ల దగ్గర అణిగిమణిగి ఉండేవారే నియోజకవర్గంలో అడుగుపెట్టాలని అంతేకానీ ఫ్యాక్షన్ రాజకీయాలు చేద్దాం, ప్రజల జీవితాలతో ఆడుకుందాం అనుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. 

ధర్మవరం నియోజకవర్గం ఇంచార్జ్ బాధ్యతలు ఎవరు తీసుకున్న గతంలో జరిగిన ఫ్యాక్షన్ రాజకీయాలకు క్షమాపణలు చెప్పి నియోజకవర్గంలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తామని నియోజకవర్గంలో అడుగుపెట్టాలని చూస్తే ఎవర్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హెచ్చరించారు.