న్యూఢిల్లీ: నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరిన తర్వాత లోకసభ సభ్యులు ముగ్గురు గురువార సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో కేశినేని నాని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను బిజెపిలో చేరబోతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. 

పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని కేశినేని నాని స్పష్టంచేశారు. ప్రధాని మోడీని కలవడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, తాను జగన్ ను కూడా కలుస్తానని సమాధామిచ్చారు. మోడీ ప్రధాని కాబట్టి కలిశానని, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కలుస్తానని, అంత మాత్రాన పార్టీ మారుతానని అనుకోవద్దని ఆయన అన్నారు. 

రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఎక్కడికైనా వెళ్తానని ఆయన అన్నారు. ప్రజల కోసం ఏపీ సీఎం జగన్‌ వద్దకు.. ప్రధాని వద్దకు.. మంత్రుల వద్దకైనా వెళ్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు బిజెపి ప్రత్యేక హోదా ఇవ్వదని నాని అన్నారు.  ప్రత్యేక హోదా సాధిస్తామని జగన్‌ చెప్పినందునే ఆయనను ప్రజలు నమ్మినట్లు అభిప్రాయపడ్డారు. 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పుడు సాధిస్తారో జగన్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. హోదా కోసం తాము అన్నివిధాలా పోరాటం చేసి విఫలమయ్యామని చెప్పారు. జగన్‌ పొర్లుదండాలు పెట్టి.. తలకిందులుగా తపస్సు చేసినా బిజెపి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వదని నాని వ్యాఖ్యానించారు.