ఒకే పార్టీలో కొనసాగుతున్న అన్నదమ్ముల  వివాదంపైనే విజయవాడ రాజకీయాల్లో కీలక చర్చ జరుగుతోంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలపై చిన్ని రియాక్ట్ అయ్యారు.

విజయవాడ : కేశినేని సోదరుల మధ్య వివాదం రచ్చకెక్కింది. వ్యక్తిగత విబేదాలు కాస్త రాజకీయ విబేధాలకు దారితీసి చివరకు అన్నదమ్ముల వర్గీయలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే స్థాయికి చేరాయి. చివరకు అన్నదమ్ముళ్లో ఎవరో ఒకరినే తెలుగుదేశం పార్టీలో కొనసాగించే పరిస్థితి ఏర్పడింది... ఈ క్రమంలో సిట్టింగ్ ఎంపీ కేశినేని నానిని కాదని ఆయన సోదరుడు కేశినేని చిన్ని వైపే అధినేత చంద్రబాబు నిలిచారు. విజయవాడ ఎంపీ టికెట్ కూడా తనకు ఇవ్వడంలేదని చంద్రబాబు సమాచారం ఇచ్చినట్లుగా కేశినేని నాని స్వయంగా ప్రకటించారు. ఇలా నాని చేసిన ప్రకటనపై కేశినేని  చిన్ని రియాక్ట్ అయ్యారు. 

కేశినేని నాని ఫేస్ బుక్ ఫోస్ట్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని చిన్ని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టిడిపిని గెలిపించుకోవడం... మళ్ళీ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే తమ ముందున్న ఏకైక లక్ష్యమని అన్నారు. అందుకోసం పనిచేయడం తప్పితే ఇతర ఏ విషయాలను తాను పట్టించుకోవడం లేదని కేశినేని చిన్ని అన్నారు. 

ప్రతి కుటుంబంలోనూ చిన్నపాటి కలహాలు సహజమేనని నాని అన్నట్లుగానే చిన్ని కూడా అన్నారు. కుటుంబ వ్యవహారాలను రాజకీయాలతో ముడిపెట్టరాదని అన్నారు. నాని విషయంలో టిడిపి ఏ నిర్ణయం తీసుకుందో తనకు తెలియదు... ఆయన ఫేస్ బుక్ పోస్ట్ ద్వారానే తనకు విషయం తెలుసనేలా చిన్ని మాట్లాడారు. 

Also Read  రేవంత్ రెడ్డి లాగే తన పరిస్థితి ... ఇప్పుడాయన సీఎం..: కేశినేని నాని ఆసక్తికర కామెంట్స్

ప్రస్తుతం అధినేత చంద్రబాబు నాయుడు తిరువూరులో చేపట్టే 'రా... కదలిరా' సభ ఏర్పాట్లపైనే తాను దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఆ సభను లక్షమందికి పైగా పార్టీ శ్రేణులు, అభిమానులు, సామాన్య ప్రజలు వస్తారన్నారు. ఈ సభను విజయవంతంగా నిర్వహించి టిడిపి సత్తా ఏమిటో ప్రత్యర్థులకు చూపిస్తామన్నారు. టిడిపిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఓ సామాన్య కార్యకర్తలా పనిచేస్తానని కేశినేని చిన్ని అన్నారు.