అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కే ఈ కృష్ణమూర్తి అవమానం ఎదురైంది. టీటీడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న శ్రీవారి ఆలయ నిర్మాణ భూకర్షక కార్యక్రమానికి ఆహ్వానించలేదు. దీంతో అధికారుల తీరుపై కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. టీటీడీ ఆలయ భూకర్షన కార్యక్రమానికి ఆహ్వానం పంపకపోవడంపై కేఈ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి అయిన తనను పిలవకపోవడంతో కేఈ అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో వెంకటపాలెంలో జరిగిన ఆలయ కార్యక్రమానికి ఆయన గైర్హాజరయ్యారు. ఇకపోతే ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు హాజరవ్వడం విశేషం. 

అమరావతి సమీపంలోని కృష్ణానది తీరాన వెంకటపాలెం దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి గురువారం ఉదయం సీఎం చంద్రబాబు భూకర్షణం, బీజవాపనం కార్యక్రమాలు నిర్వహించి ఆగమయోక్తంగా ప్రారంభించారు. 

తిరుమల తరహాలో భారతీయ కళ ఉట్టిపడేలా నిర్మాణం జరపాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల పాటు 25 ఎకరాల స్థలంలో శ్రీవారి ఆలయం, ఉప ఆలయాలు, కళ్యాణమండపాల నిర్మాణాలు, ద్రవిడ శిల్ప రీతులతో జరుగనున్నట్లు ఇప్పటికే టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. 

భూకర్షణంలో భాగంగా శ్రీవారి కళ్యాణోత్సవం, వసంతోత్సవ కార్యక్రమాలను మరికాసేపట్లో నిర్వహించనున్నారు. భూకర్షణం తర్వాత పదిరోజుల పాటు అర్చకులు ఆగమోక్తంగా వైదిక కార్యక్రమాలు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధార్మిక కార్యక్రమాలు జరపనున్నారు. ఆ తర్వాత ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. 

భూకర్షణం కార్యక్రమం సందర్భంగా హోమగుండాలు, వేదిక, సీఆర్డీయే స్టాళ్లు, ఆలయ నమూనా ఎగ్జిబిషన్, ప్రత్యక్ష ప్రసారాల డిస్‌ప్లే స్క్రీన్లు ఏర్పాటు చేశారు. దాదాపు రూ.140కోట్లతో ఆలయ నిర్మాణం చేపట్టేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి ఇప్పటికే టెండర్లను ఖరారు చేసింది. 

ఆలయ నిర్మాణం కూడా అత్యంత వేగంగా జరుగనుందని టీటీడీ ధర్మకర్తల మండలి ప్రకటించింది. ఇంతటి భారీ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి అయిన తనను పిలవకపోవడంపై మంత్రి కేఈ కృష్ణమూర్తి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అందువల్లే భూకర్షక కార్యక్రమానికి హాజరుకాకుండా దూరంగా ఉన్నారు.