చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.. : ములాఖత్ అనంతరం కాసాని జ్ఞానేశ్వర్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈరోజు చంద్రబాబుతో ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేశ్‌తో పాటు కాసాని జ్ఞానేశ్వర్ ములాఖాత్ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి చూసి భువనేశ్వరి, లోకేష్ ఆవేదన చెందినట్టుగా తెలుస్తోంది. అనంతరం లోకేష్, భువనేశ్వరిలు మీడియాతో మాట్లాడకుండా.. అక్కడికి సమీపంలో క్యాంపు సైట్‌కు వెళ్లిపోయారు.
అయితే చంద్రబాబుతో ములాఖత్ అనంతరం కాసాని జ్ఞానేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. ఆయన మాట్లాడలేకపోతున్నట్లు చెప్పారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో నిత్యం ప్రజల కోసం పనిచేసిన చంద్రబాబును జైలులో చూడగానే బాధ కలిగిందని అన్నారు. త్వరలోనే చంద్రబాబు జైలులో నుంచి బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఇక, చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై రాజమండ్రి ప్రభుత్వ వైద్యులు నివేదిక వెలుగులోకి వచ్చింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుకు అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయని వైద్యులు రిపోర్టులో పేర్కొన్నారు. చంద్రబాబు చేతులు, ముఖంతో పాటు కొన్ని శరీర భాగాల్లో దద్దుర్లు, స్కిన్ ఎలర్జీ ఉన్నట్టుగా వైద్యులు నిర్దారించారు. అంతేకాకుండా తీవ్రమైన ఎండల వల్ల డీహైడ్రేషన్‌తో ఇబ్బంది పడుతున్నారని వైద్యులు పేర్కొన్నారు. డీహైడ్రేషన్ వల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా చల్లని వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.