కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ మహిళ మదనపల్లిలోని ఓ లాడ్జీలో దారుణ హత్యకు గురయ్యింది. ఆమెతో పాటు రూంలో దిగిన వ్యక్తే ఈ హత్యకు పాల్పడి వుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

చిత్తూరు: కర్ణాటకకు చెందిన ఓ మహిళ మదనపల్లి (madanapalli)లోని ఓ లాడ్జీలో దారుణ హత్యకు గురయ్యింది. రెండు రోజుల క్రితం ఓ వ్యక్తితో కలిసివచ్చిన లాడ్జీలో దిగిన మహిళ అనుమానాస్పద రీతిలో మృతిచెందింది. ఆమెతో వచ్చిన వ్యక్తే ఈ దారుణానికి పాల్పడి పరారయి వుంటాడని అనుమానిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం ముళబాగల్ కు చెందిన గీత(40) మరో వ్యక్తితో కలిసి జనవరి 6వ తేదీన చిత్తూరు జిల్లాలోని మదనపల్లెకు వచ్చింది. ఇద్దరూ కలిసి బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జీలో దిగారు. ఇలా గత రెండు రోజులుగా అదే లాడ్జీలో వుంటున్న మహిళ నిన్న(శనివారం) రూంలో మృతిచెంది కనిపించింది. 

శనివారం ఉదయం లాడ్జి సిబ్బంది రూం తలుపుతట్టినా లోపలినుండి ఎవరూ స్పందించలేదు. ఇలా ఎంతసేపటికి తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే పోలీసులు లాడ్జీకి చేరుకుని తలుపులు బద్దలుగొట్టి చూడగా అప్పటికే గీత మృతిచెంది కనిపించింది. 

వెంటనే పోలీసులు క్లూస్ టీం సహాయంతో రూంలో ఆధారాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

లాడ్జీలో దిగిన సమయంలో గీత ఇచ్చిన ఫోన్ నెంబర్ ఆధారంగా వివరాలు సేకరించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మహిళతో పాటు లాడ్జీలో దిగిన వ్యక్తి ఎవరన్నది కనుక్కునే పనిలో పోలీసులు వున్నారు. లాడ్జీలోని సిసి కెమెరాల ఆధారంగా అతడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. 

శుక్రవారం రాత్రే గీతతో పాటు లాడ్జీలో దిగిన వ్యక్తి బయటకు వెళ్లి తిరిగి రాలేదని లాడ్జీ సిబ్బంది చెబుతున్నారు. అంటే శుక్రవారం రాత్రి గీతను చంపివుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి ఫోన్ నెంబర్ స్విచాప్ లో వుంది. కాబట్టి అతడే హంతకుడై వుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇదిలావుంటే పెళ్లిరోజునే ఓ దుర్మార్గుడు కట్టుకున్న భార్యను పొట్టన పెట్టుకున్న ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. గత నెల డిసెంబర్ 25న భార్యను చంపి ఇంట్లోనే పాతిపెట్టాడు దుర్మార్గుడు. అనంతరం తనకు ఏమీ తెలియనట్లు భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదుచేసాడు. అతడి తీరుపై అనుమానంతో తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బైటపెట్టాడు. 

క‌ర్నాట‌క రాష్ట్రం చిత్ర‌దుర్గ ప్రాంతానికి చెందిన సుమ(26), నార‌ప్ప దంప‌తులు. వీరిద్ద‌రికి పెళ్ల‌యి ఏడాది అవుతోంది. అయితే గ‌త నెల డిసెంబ‌ర్ 25వ తేదీన భార్య సుమ‌ను చంపేశాడు. త‌రువాత ఆమె మృత‌దేహాన్ని బాత్ రూమ్‌లో పూడ్చేశాడు. అయితే సరిగ్గా అదే రోజు వారి పెళ్లి రోజు కావ‌డం గ‌మ‌నార్హం. 

త‌రువాత తెలియ‌న‌ట్టు పోలీసుల‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. త‌న భార్య క‌నిపించ‌డం లేద‌ని వారితో చెప్పారు. అత‌డి తీరుతో పోలీసుల‌కు అనుమానం వ‌చ్చింది. దీంతో నార‌ప్ప‌ను పోలీసులు విచారించ‌గా.. తానే చంపేసిన‌ట్టు ఒప్పుకున్నాడు దీంతో వాళ్లు నివ‌సించే ఇంటికి పోలీసులు వ‌చ్చారు. ఇళ్లంతా త‌నిఖీ చేశారు. దీంతో సుమ మృతదేహం బ‌య‌ట‌ప‌డింది. దీంతో పోలీసులు అత‌డిపై కేసు న‌మోదు చేశారు.