బెంగళూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను ఇతర రాష్ట్రాల నేతలు సమర్థిస్తున్నారు. ఇప్పటికే కంపెనీలలో స్థానికులకే 75శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ తమిళనాడులో ఓ ఉద్యమమే మెుదలైంది. 

జగన్ ను పొగుడుతూ ఆంధ్రా తలైవా అంటూ కూడా ఫ్లెక్సీలు వేసి మరీ ప్రశంసలతో ముంచెత్తారు. తాజాగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన నేపథ్యంలో కర్ణాటకలోని ఆర్టీసీ ఉద్యోగులు సైతం ఉద్యమ బాట పట్టారు.  

కర్ణాటక ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలని హీరే కరూర్ లోని కేఎస్ ఆర్టీసీ డిపో సిబ్బంది ఆందోళన నిర్వహించారు. అనంతరం ఆంధ్ర సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో సైతం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ఒత్తిడులు తెస్తున్నారు ఉద్యోగులు. లేని పక్షంలో సమ్మెకు దిగుతామని హెచ్చరించిన సంగతి తెలిసిందే.