ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కర్ణాటక సీఎం కుమార స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైయస్ జగన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. 

అందులో భాగంగా ఏపీ భవన్ లో ఉన్న సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు అభినందనలు తెలిపారు. అనంతరం దేశ, రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. 

అలాగే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాలపై చర్చించినట్లు తెలుస్తోంది. జలవనరులను ఇరు రాష్ట్రాల మధ్య పంపకాలపై ప్రధానంగా చర్చజరిగినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం సాయంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జగన్ భేటీ అయ్యారు. 

ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలుపై చర్చించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై ప్రధాని నరేంద్రమోదీకి కాస్త చెప్పాలని సూచించారు సీఎం జగన్. అలాగే శనివారం ఉదయం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పార్లమెంటరీ సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్ వారికి దిశానిర్దేశం చేశారు.