గుంటూరు జిల్లా కర్లపాలెం గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగులతో స్థానికి వీఆర్వో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విధి నిర్వహణలో వున్న తమపై విలేజ్ రెవెన్యూ అధికారి బూతులు తిట్టారంటూ ఇద్దరు మహిళా ఉద్యోగులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  

ఈ నెల 19వ తేదీన కర్లపాలెం గ్రామంలో ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న తమపై అకారణంగా వీఆర్వో జాన్ విక్టర్ కుమార్ పరుష పదజాలంతో దూషణలకు దిగాడని సౌందర్య(మహిళా పోలీస్), భ్రమరాంభ దేవి(విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్) ఆరోపించారు. ఈ మేరకు అతడిపై సదరు వీఆర్వోపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ మండల పరిషత్ అధికారికి వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 

ఈ కీచక విఆర్వోను విధుల్లోనుండి తప్పించేవరకు తమ పోరాటం ఆగదని సచివాలయ ఉద్యోగిణులిద్దరు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ అండ ఉందని రెచ్చిపోతున్న వీఆర్వోపై ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలని వారు ఉన్నతాధికారులను కోరారు. తమకు న్యాయం జరిగే వరకు విధులకు హాజరుకాబోమని హెచ్చరించారు.