చంద్రబాబునాయుడుపై టిడిపి నేత, ఎంఎల్సీ కరణం బలరాం సెటైర్లు వేశారు. అదికూడా రాజకీయాల్లో 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబు పార్టీ నేతలతో సరదాగా గడుపుతున్న సమయంలోనే కరణం చంద్రబాబుపై కామెంట్లు చేయటం గమనార్హం. కరణం మీడియాతో మాట్లాడుతూ తాను కూడా 40 ఏళ్ళ రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకున్నట్లు చెప్పారు.

డబ్బు సంపాదనే ధ్యేయంగా పార్టీలు మారుతున్న వారిని ప్రోత్సహించటం ఏమాత్రం మంచిది కాదంటూ చంద్రబాబుకు చురకలంటించారు. చంద్రబాబు ప్రోత్సహిస్తున్న ఫిరాయింపు రాజకీయాలపై కరణం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రస్తుత రాజకీయాలు కేవలం డబ్బుతోనే నడుస్తున్నట్లు చెప్పారు. రాజకీయాల్లో నైతికత, ఐనైక్యత కొరవడిందన్నారు.

చంద్రబాబు, తాను ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చి ఒకేసారి ఎంఎల్ఏలుగా గెలిచినట్లు గుర్తు చేసుకున్నారు. పదవుల కోసం తాను ఏనాడు పాకులాడలేదన్నారు. ప్రకాశం జిల్లా అంటే కరణం..కరణం అంటే ప్రకాశం జిల్లా అన్న గుర్తింపు చాలని చెప్పారు.