ప్రకాశం: చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పడంతో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అడుగుల వేస్తోంది. ఆమంచి పార్టీకి గుడ్ బై చెప్పిన నేపథ్యంలో ఆయన వెంట తెలుగుదేశం క్యాడర్ వెళ్లకుండా ఉండేలా చూడాలని టీడీపీ అధిష్టానం జిల్లా నాయకత్వానికి ఆదేశించింది. 

దీంతో జిల్లాకు చెందిన మంత్రి శిద్ధా రాఘవరావు, టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం, ఎమ్మెల్సీ పోతుల సునీతలు రంగంలోకి దిగారు. చీరాల నియోజకవర్గంలో నష్ట నివారణ చర్యలకు అడుగులు వేస్తున్నారు. అధిష్టానం ఆదేశాలతో చీరాల నియోజకవర్గంలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. 

ఈ సమావేశంలో టీడీపీ కార్యకర్తలకు నేతలు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. నియోజకవర్గంలో టీడీపీ బలోపేతంగా ఉందని కార్యకర్తలు అధైర్యపడకుండా ఉండాలని సూచించారు. సమావేశంలో టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కరణం బలరాం కీలక వ్యాఖ్యలు చేశారు. 

అధిష్టానం ఆదేశిస్తే చీరాల నుంచి తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడుకు చీరాల టికెట్ బీసీలకు ఇవ్వాలని సూచించినట్లు చెప్పుకొచ్చారు. ఆమంచి కృష్ణమోహన్ పార్టీ వీడినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదన్నారు. 

అయితే పార్టీ వీడిన తర్వాత ఆమంచి కృష్ణమోహన్ చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. ముఖ్యమంత్రిపైనా, ప్రభుత్వ సంక్షేమ పథకాలను తప్పుబడుతూ ఆమంచి చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సరికాదన్నారు. ఇకపోతే చీరాల నియోజకవర్గం నుంచి కరణం బలరాం లేదా ఆయన తనయుడు కరణం వెంకటేశ్ ను బరిలోకి దింపాలని యోచిస్తున్నారు. 

అయితే కరణం వెంకటేశ్ ను సీఎం చంద్రబాబు ఏపీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అకాడమీ చైర్మన్‌ గా నియమించిన నేపథ్యంలో  ఆయన అభ్యర్థిత్వంపై అభ్యంతరం తెలిపే అవకాశం ఉందని ఒకవేళ తనయుడికి టికెట్ ఇవ్వకపోతే తాను పోటీ చేస్తానని కరణం బలరాం సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది.