ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బాలరామకృష్ణ మూర్తి కి పదవి ఎసరు వచ్చింది. బాలరాం ఎన్నికను సవాలు చేస్తూ..  వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టును ఆశ్రయించారు.  కరణం బలరాం ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఆయన ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో కరణంతోపాటు ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు అభ్యర్థులను, రిటర్నింగ్ అధికారిని ప్రతివాదులుగా పేర్కొన్నారు.

క‌ర‌ణం బ‌ల‌రాం స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌లో వాస్తవాలు వెల్ల‌డించ‌లేద‌ని ఆమంచి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాల‌ను ఆయ‌న ఈరోజు మీడియాకు విడుద‌ల చేశారు. బలరాం తన నామినేషన్ పత్రంలో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆమంచి ఆరోపించారు. కరణం బలరాంకి ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలు ఉన్నారని.. అయితే.. అఫిడవిట్ లో మాత్రం ఒక్క భార్య గురించే పేర్కొన్నారని ఆయన చెప్పారు.

1985లోనే కాట్ర‌గ‌డ్డ‌ ప్ర‌సూన‌తో బ‌ల‌రాం వివాహం శ్రీశైలంలో జ‌రిగింద‌ని… వారికి 1989లో అంబిక కృష్ణ అనే అమ్మాయి హైద‌రాబాద్‌లోని సెయింట్ థెరిసా ఆసుప‌త్రిలో జ‌న్మించింద‌ని ఆమంచి తెలిపారు. అంబిక ప‌దో త‌ర‌గ‌తి స‌ర్టిఫికెట్‌తో పాటు ఆధార్‌కార్డులో తండ్రి పేరు బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి అని ఉంది. అంబిక అన్న‌ప్రాస‌న‌, తొలి పుట్టినరోజు వేడుక‌లు, అక్ష‌రాభ్యాస వేడుక‌ల‌కు సంబంధించిన ఫోటోల్లో బ‌ల‌రాం ఉన్నారు.

అంబికా త‌న కూతురు కాద‌ని బ‌ల‌రాం ఏ ప‌రీక్ష‌కైనా సిద్ద‌మా అని…. ఆమంచి స‌వాల్ విసిరారు. ఫోరెన్సిక్‌, డీఎన్ఏ వంటి సైంటిఫిక్ ప‌రీక్ష‌ల‌కు కూడా అంబికా సిద్ధంగా ఉంద‌ని…. బ‌ల‌రాం మ‌రి మీరు సిద్ద‌మా? అని ఆమంచి స‌వాల్ విసిరారు. ఇప్పుడు కనుక ప్రసూన, ఆమె కుమార్తె అంబిక కోర్టు ముందుకు వచ్చి ఆమంచి చెప్పింది నిజమని చెబితే... కరణం బలరాం పదవి ఊదడం ఖాయమని తెలుస్తోంది. దీంతో... టీడీపీ బలం తగ్గి.. వైసీపీ బలం మరింత పెరగనుంది.