కాపులను బిసిల్లో చేరిస్తే మొత్తం క్రెడిట్ ముద్రగడకే వెళుతుందే కానీ చంద్రబాబుకు ఏమీ రాదు. కాబట్టి ఎట్టి పరిస్ధితుల్లోనూ చంద్రబాబు సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం లేదు.
కాపు సామాజిక వర్గం రెండు పడవల్లో ప్రయాణం చేస్తున్నట్లుంది. అందులో మొదటిది రాజ్యాధికారం సాధన కాగా, రెండోది బిసిల్లో చేర్చటం. అయితే ఇందులో ఏది ముందు సాధించుకోవాలో తేల్చుకోలేకున్నారు. ఈ సందిగ్దంతోనే పుణ్యకాలం కాస్త గడిచిపోతోంది.
ఇప్పటికైనా ఏది ముందో తేల్చుకోకపోతే భవిష్యత్తులో రెంటికి చెడ్డ రేవడిలాగ అయిపోతుంది కాపుల పరిస్ధితి.
తమకు రాజ్యాధికారం కావాలా? లేక బిసిల్లో చేర్చటం కావాలా అన్న డిమాండ్లలో ఏదో ఒకటే నిర్ణయించుకోవాలి. ఏకకాలంలో రెండు డిమాండ్లనూ పట్టుకుంటే ఏదీ నెరవేరదు. ప్రస్తుతం ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆ పనే చేస్తున్నారు.
కాపులను బిసిల్లో చేర్చాలన్న డిమాండ్ సాకారమయ్యేందుకు సాంకేతిక, న్యాయపరమైన అవరోధాలు చాలా ఉన్నాయి. న్యాయనిపుణుల ప్రకారం కాపులను బిసిల్లో చేర్చటం సాధ్యం కాదు. అందుకే కాపులను బిసిల్లో చేర్చటమన్నది కేవలం రాజకీయ నినాదంగా మాత్రమే మిగిలిపోతోంది.
జనాభా రీత్యా బిసిలతో పోల్చుకుంటే కాపుల సంఖ్య చాలా తక్కువ. ఏ కులంలోనైనా అభివృద్ధి చెందిన వారు, వెనుకబడిన వారున్నట్లే కాపుల్లో కూడా ఉన్నారు. పైగా కాపు సామాజిక వర్గంలో కులాలు, ఉప కులాలు చాలా ఉన్నాయి. కోస్తా ప్రాంతంలోని కాపులను రాయలసీమ, నెల్లూరు ప్రాంతంలో బలిజలంటారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కాపుల జనాభా సుమారు 23 శాతం.
అదేసమయంలో రాష్ట్ర జనాభాలో బిసిల వాటా సుమారు 50 శాతం పైమాటే. బిసిల్లోనూ అనేక ఉపకులాలున్నా వర్గీకరణ రీత్యా ఉపకులాలకు రిజర్వేషన్లు అందుతున్నాయి. కాపులను బిసిల్లో చేరిస్తే తమ రిజర్వేషన్ ఫలాలకు పోటీ పెరిగిపోతుందని బిసి నేతలు వాదిస్తున్నారు. కాబట్టి కాపులను తమలో చేర్చటాన్ని బిసిలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.
ఏ ప్రభుత్వం కూడా మెజారిటీ వర్గం డిమాండ్ ను కాదని మైనారిటీలను నెత్తిన పెట్టుకోదు. ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం కాపులను బిసిల్లో చేర్చినా ఎవరో ఒకరు కోర్టుకు వెళతారు. సదరు నిర్ణయం అమలు కాకుండా అడ్డుకుంటారు. అపుడు కాపులు చేసేది కూడా ఏమీ ఉండదు.
కాపు సామాజిక వర్గంలో ముద్రగడకు మద్దతున్నట్లే వ్యతిరేకించే వారు కూడా ఉన్నారు. వ్యతిరేకుల్లో మంత్రిపదవుల్లో ఉన్న వారు కూడా ఉన్నారు. పైగా కాపులను బిసిల్లో చేరిస్తే మొత్తం క్రెడిట్ ముద్రగడకే వెళుతుందే కానీ చంద్రబాబుకు ఏమీ రాదు. కాబట్టి ఎట్టి పరిస్ధితుల్లోనూ చంద్రబాబు సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం లేదు.
ఇక, రాజ్యధికారం గురించి ఆలోచిస్తే కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పేర్లు వేరైనప్పటికీ సామాజిక వర్గం మాత్రం ఒకటే. అయితే, వారిలోని అనైక్యతే రాజకీయ పార్టీలకు వరంగా మారింది. ఈ విషయాలు తెలిసినా కొందరు కాపు నేతల స్వార్ధం కారణంగా ఉద్యమం ప్రతీసారి నీరుగారి పోతోంది.
ఉద్యమకారులు ఓ విషయాన్ని గమనించాలి. తమను బిసిల్లో చేర్చమని చేస్తున్న డిమాండుతో బిసిల్లో శతృభావం పెరుగుతోంది. ముందు రాజ్యాధికారం గురించి ఆలోచిస్తే మంచిది. రాజ్యాధికారం చేతిలో ఉంటే ఏదైనా సాధించవచ్చు. అది లేనపుడు ఎన్ని ఉద్యమాలు చేసినా ఫలితముండదు.
