అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుస వివాదాలు పెద్ద తలనొప్పిగా మారాయి. ఎన్నికలకు ముందు ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీ, సీఎస్ బదిలీల వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపితే తాజాగా మరో అధికారి బదిలీ రాజకీయంగా దుమారం రేపుతోంది. 

కాపు కార్పొరేషన్‌ ఎండీ శివశంకర్‌ను బదిలీ చేస్తూ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జారీ చేసిన ఉత్తర్వులు వివాదానికి కారణమవుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉండగా ఎండీ శివశంకర్ ను ఎలా బదిలీ చేస్తారంటూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 

ఎన్నికల సంఘం ముందస్తు అనుమతి లేకుండా ఉన్నతాధికారిని బదిలీ చేయటంపై వివాదం రాజుకుంటోంది. కాపు కార్పొరేషన్ ఎండీగా పనిచేస్తున్న జి.శివశంకర్‌ను బదిలీ చేస్తూ వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బి.ఉదయ లక్ష్మి ఈనెల 18న ఉత్తర్వులు జారీ చేశారు. 

ప్రణాళికా శాఖకు చెందిన ఆయన్ను మాతృశాఖకే బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. మే 27 వరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో శివశంకర్ బదిలీ అంశం వివాదాస్పదంగా మారుతోంది. అయితే బదిలీపై ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. 

బదిలీ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే కాపు కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన కొత్తపల్లి సుబ్బారాయుడు ఇటీవలే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఎన్నికల కోడ్ ముగియకుండానే ఎండీని మార్చడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.