ప్రముఖ కన్నడ సినీ నటుడు గొంది సిద్ధూ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ లో కావడం గమనార్హం. గొంది సిద్ధూ ఆదివారం తన అనుచరులతో సహా.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన పేరుకి కన్నడ నటుడు అయినప్పటికీ..  ఆయన స్వగ్రామం విశాఖపట్నం జిల్లా రోలుగుంట మండలం బీబీ పట్నం కావడం గమనార్హం.

ఈ నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరారు. రత్నంపేటలో జరిగిన సభలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పార్టీ కండువాను సిద్ధూకి కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిద్ధూ మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ గ్రామానికి వచ్చిన కరణం ధర్మశ్రీ  బోరు, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని.. ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చారని గుర్తు చేసుకున్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ప్రశంసించారు. అంతేకాకుండా పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఆయనను మించిన సీఎం ఎవరూ ఉండరని.. ఉండబోరని కొనియాడారు.