Asianet News TeluguAsianet News Telugu

బాబుకు కన్నా ప్రశ్నలు: అది బాలకృష్ణ వియ్యంకుడిది కాదా?

విశాఖపట్నం మధురవాడలో మీ కుమారుని మిత్రుడైన జి శ్రీధర్‌ రాజుకు 360 కోట్ల రూపాయల విలువైన భూమిని 25 కోట్ల రూపాయలకు కట్టబెట్టలేదా? అని కన్నా చంద్రబాబును ప్రశ్నించారు.

Kanna writes letter to Chnadrababu
Author
Guntur, First Published Sep 19, 2018, 1:21 PM IST

అమరావతి: బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖ రాశారు. ఈ బహిరంగ లేఖలో ఆయన చంద్రబాబుకు ఐదు ప్రశ్నలు సంధించారు. గత కొంత కాలంగా కన్నా ముఖ్యమంత్రికి బహిరంగ లేఖలు రాస్తూ వస్తున్నారు. 

విశాఖపట్నం మధురవాడలో మీ కుమారుని మిత్రుడైన జి శ్రీధర్‌ రాజుకు 360 కోట్ల రూపాయల విలువైన భూమిని 25 కోట్ల రూపాయలకు కట్టబెట్టలేదా? అని కన్నా చంద్రబాబును ప్రశ్నించారు. ఏపీఎల్‌ఎమ్‌ఏ, సర్వే నంబర్ 409లో ఉన్న భూమికి ఎకరం విలువ 7.26 కోట్ల రూపాయలుగా నిర్ణయిస్తే.. మీ మంత్రివర్గం దాన్ని 50 లక్షల రూపాయల ధర నిర్ణయించలేదా? అని అడిగారు. ఇందులో మీకు, మీ కుమారునికి ముడుపులు అందలేదని చెప్పగలరా అని ప్రశ్నించారు.

వ్యవసాయ రుణాలపై బ్యాంకులు వసూలు చేసే 7 శాతం వడ్డీలో కేంద్రం తన 3 శాతం చెల్లిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం వాటా 4 శాతాన్ని గత నాలుగేళ్లుగా చెల్లించని మాట వాస్తవం కాదా అని కన్నా చంద్రబాబును అడిగారు. దీంతో బ్యాంకులు ఆ మొత్తాన్ని పేద రైతుల నుంచి బలవంతగా వసూలు చేస్తున్న మాట వాస్తవం కాదా? ఆ బకాయిలను ఎప్పటిలోగా చెల్లించి రైతులకు ఉపశమనం కలిగిస్తారని ఆయన అడిగారు. 

కృష్ణా జిల్లా జగయ్యపేట మండలం జయంతిపురం గ్రామంలో సర్వే నంబర్‌ 93లోని 499 ఎకరాల కోట్లాది రూపాయల విలువైన భూమిని కారుచౌకగా వీబీసీ ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌కు దారదత్తం చేయలేదా?. ఆ కంపెనీ మీ బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకునికి చెందినది కాదా? ఈ కేటాయింపులో అవకతవకలు జరగలేదని శ్వేత పత్రం విడుదల చేయగలరా అని మరో ప్రశ్నను సంధించారు.

కేంద్రం రాష్ట్రానికి విద్యాసంస్థలు ఇవ్వడం లేదని చెబుతున్న మీరు.. 2016 డిసెంబర్‌లో కేంద్ర మంత్రులు శంకుస్థాన చేసిన ఎస్‌సీఈఆర్‌టీకి ఎందుకు భూమి ఎందుకు కేటాయించలేదో ప్రజలకు వివరించగలరా అని అడిగారు. 

ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం మేజర్‌ పోర్టుకు ఎప్పుడో రైట్స్‌ లిమిటెడ్‌ సంస్థ అనుకూలంగా రిపోర్టు ఇచ్చినా.. ప్రైవేటు రంగంలో మైనర్‌ పోర్టుకు ఎందుకు నిర్ణయం తీసుకున్నారో ప్రజలకు వివరించగలరా అని కన్నా చంద్రబాబును అడిగారు. వెనకబడిన ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేసే విషయంలో ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారని  కన్నా లక్ష్మినారాయణ చంద్రబాబును అడిగారు. 

Follow Us:
Download App:
  • android
  • ios