అమరావతి: ఏపీలో సార్వత్రిక ఎన్నికలపై బీజేపీ ప్రత్యేక దృష్టిసారించింది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పొత్తుతో తన ఉనికిని  కాపాడుకున్న బీజేపీ రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగాలని యోచిస్తోంది. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంపై చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు బీజేపీ వ్యూహ రచన చేస్తోంది. 

ఏపీకి కేంద్రం చేసిందేమీలేదు అంటూ చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్రమంత్రులతో సమాధానం చెప్పించాలని భావిస్తోంది. లేని పక్షంలో చంద్రబాబు పదేపదే చెప్పే ఆరోపణలను ప్రజలు నమ్మి బీజేపీని దోషిగా చూసే అవకాశం ఉందని భావించిన బీజేపీ అధిష్టానం ఇక ఏపీలో తామేంటో నిరూపించేందుకు రెడీ అవుతోంది. 

ఈ నేపథ్యంలో ఏపీలో పర్యటించాలని ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మోదీ పర్యటనలకు తేదీలు ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం. ఫిబ్రవరి 10న గుంటూరు జిల్లాలో, 16న విశాఖ జిల్లాలో మోదీ పర్యటించనున్నారు. 

అలాగే బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఫిబ్రవరి 4న విజయనగరం జిల్లాలో పర్యటిస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఆ తర్వాత ఫిబ్రవరి 21న రాజమహేంద్రవరంలోని క్లస్టర్ మీటింగ్, పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశం కానున్నారు. ఫిబ్రవరి 26న ఒంగోలులో పర్యటించనున్నారు. 

 జనవరి 6నే ప్రధాని నరేంద్రమోదీ ఏపీలో పర్యటించాల్సి ఉందని అయితే కేరళ పర్యటన నేపథ్యంలో ఆ పర్యటన కాస్త వాయిదా పడింది. ఫిబ్రవరి 10న గుంటూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొటారని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.