Kanna Lakshminarayana Biography: స్వశక్తితో రాజకీయాల్లో ఎదిగిన నేతగా కన్నా లక్ష్మీనారాయణ గారి పేరు చెప్పవచ్చు. గతంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన కన్నా ప్రస్తుతం టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. గల్లీ లీడర్ నుండి ఢిల్లీ నేతగా ఎదిగిన తీరు అందరికీ ఆదర్శప్రాయం. 2024 ఎన్నికల్లో భాగంగా ఆయన సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ వ్యక్తిగత, రాజకీయ జీవిత విశేషాలను తెలుసుకుందాం.
Kanna Lakshminarayana Biography:
బాల్యం, విద్యాభ్యాసం
కన్నా లక్ష్మీ నారాయణ 1954 ఆగస్టు 13న గుంటూరు జిల్లా నాగారం పాలెంలో జన్మించారు. ఆయన తల్లితండ్రులు కన్న రంగయ్య & కన్న మస్తానమ్మ. చిన్ననాటి నుంచి ఇటు చదువుల్లోనూ.. అటు ఆటల్లోనూ చాలా చురుకగా ఉండేవారు. ఆయన వెయిట్ లిఫ్టర్, షూటింగ్‌ల్లో పలు పోటీల్లో పాల్గొని ఎన్నో పతాకాలను సాధించారు. ఆయన బి.కామ్.గ్రాడ్యుయేట్. కన్నా లక్ష్మీనారాయణ కన్న విజయ లక్ష్మిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
రాజకీయ జీవితం
కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ ప్రస్తానం విద్యార్థిదశ నుంచే ప్రారంభమైంది. 1973లో గుంటూరు జిల్లా ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడిగా పనిచేసిన కన్నా 1987-88లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ స్థాయికి ఎదిగారు. 1989లో గుంటూరు జిల్లా పెదకూరపాడు నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత 1994,1999, 2004 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు శాసనసభ్యుడిగా గెలిచి.. అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009లో తన స్వంత నియోజకవర్గం నుంచి కాకుండా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి..అక్కడ కూడా తన విజయకేతనాన్ని ఎరగవేశారు. ఇలా మొత్తం ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కన్నా లక్ష్మీనారాయణ.
పదవులు
1991-94 మధ్యకాలంలో నేదురుమల్లి జనార్ధన రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలోని మంత్రివర్గంలో ఆయనకు చోటుదక్కింది.1994లో ఎన్టీఆర్ ప్రభంజనంలో ఏపీ కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. కాంగ్రెస్ పార్టీ నుంచి కేవలం 26 మంది మాత్రమే ఎమ్మెల్యేలు గెలుపొందారు. అందులో కన్నా లక్ష్మీనారాయణ ఒకరు. ఇక 2004లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. సీనియర్ నాయకుడైన కన్నాకు క్యాబినెట్‌లో చోటు కల్పించారు.ఇలా 2009నుంచి 2010 వరకు ప్రధాన పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఎగుమతి, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి పనిచేశారు.
వైఎస్ రాజశేఖర్ ఆకస్మిక మరణం తరువాత రోషయ్య సీఎం అయ్యారు. ఆయన కేబినెట్ లో కూడా మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత ముఖ్యమంత్రి అయినా కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో కూడా కీలకమైన వ్యవసాయం, వ్యవసాయ సాంకేతిక మంత్రిగా పనిచేశారు. ఇలా 2009- 2014 మధ్యకాలంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలలో కీలక మంత్రిత్వ శాఖ నిర్వహించారు. ఎవరైనా సరే అందరికి సన్నిహితంగా ఉండేవారు కన్నా లక్ష్మీనారాయణ.
బీజేపీలో చేరిక
తన నియోజకవర్గం అభివృద్ధి విషయంలో ఎప్పుడూ రాజీపడని కన్నా ఆనాటి గ్రూప్ రాజకీయ నేపథ్యంలో 2014 ఎన్నికల తర్వాత అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరారు. ఆ తర్వాత ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా బాధ్యతలు తీసుకున్నారు. అప్పటినుంచి కన్నా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. నిత్యం అధికార పక్ష విధివిధానాలను అడుగడుగునా ఎండగట్టి జాతీయస్థాయి నేతల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. రెండుసార్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేశారు. ప్రస్తుతం బీజేపీ కోర్ కమిటీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతున్న కన్నా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఏపీలో క్షేత్రస్థాయిలో బిజెపి బలోపేతానికి కృషి చేస్తున్నారు. 2023 ఫిబ్రవరిలో బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. ఇక 2024 ఎన్నికల్లో భాగంగా ఆయన సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు.
