ఆంధ్ర ప్రదేశ్ లో ఆసక్తికర కుల సమీకరణలు కలిగిన నియోజకవర్గం కనిగిరి. రాష్ట్ర రాజకీయాల్లో కమ్మ, కాపుల ఆధిపత్యం కనిపిస్తే కనిగిరిలో మాత్రం రెడ్డి సామాజికవర్గ ఆధిపత్యం కొనసాగుతోంది. ఇప్పటివరకు ఇక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేసివారిలో అత్యధికులు రెడ్డీలే. అయితే వీరి ఆధిపత్యానికి గండికొడుతూ గతేడాది యాదవ అభ్యర్థిని బరిలోకి దింపి విజయం సాధించింది వైసిపి. ఈసారి కూడా అదే ఫార్మూలాను ఫాలో అవుతూ ఓ యాదవ అభ్యర్థిని కనిగిరి బరిలో దింపింది వైసిపి... మరి అక్కడి ఓటర్ల తీర్పు ఎలా వుంటుందో చూడాలి. 

కనిగిరి రాజకీయాలు : 

కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు వున్నారు. ఆ తర్వాత యాదవులే అధికం. దీంతో ఈ రెండు సామాజికవర్గాల మధ్య రాజకీయ ఆధిపత్యం కోసం పోరు జరుగుతోంది. పార్టీ ఏదయినా... ఎన్నికలు ఏవయినా... కనిగిరిలో రెడ్డిలు లేకుండా పోటీ వుండదు. నియోజకవర్గ ఏర్పాటునుండి 2019 అసెంబ్లీ ఎన్నికల వరకు ఇదే పరిస్థితి. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి కనిగిరి బరిలో యాదవ అభ్యర్థిని నిలిపి విజయం సాధించింది. దీంతో ఒక్కసారిగా నియోజకవర్గ రాజకీయాలు మారిపోయాయి. 

అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బుర్రా మధుసూదన్ యాదవ్ ను కాదని ఈసారి మరో యాదవ అభ్యర్థిని ఎంపికచేసారు వైసిపి అధినేత వైఎస్ జగన్. దద్దాల నారాయణ యాదవ్ ను ఈసారి కనిగిరిలో పోటీలో నిలిపింది వైసిపి. టిడిపి మాత్రం ముక్కు ఉగ్రనరసింహ రెడ్డిని పోటీలో నిలిపింది. దీంతో ఈసారి కనిగిరిలో గెలుపు రెడ్డిలదా? యాదవులదా? అన్న చర్చ జోరందుకుని ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. 

కనిగిరి నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. హనుమంతునిపాడు
2. చంద్రశేఖరపురం
3. పామూరు
4. వెలిగండ్ల
5. పెద్దచెర్లోపల్లి
6. కనిగిరి

కనిగిరి అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,32,084
పురుషులు - 1,17,966
మహిళలు ‌- 1,14,105

కనిగిరి అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో మాదిరిగానే కనిగిరిలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చి ప్రయోగం చేస్తోంది వైసిపి. ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ను కాదని దద్దాల నారాయణ యాదవ్ ను పోటీలో నిలిపింది వైసిపి.

టిడిపి అభ్యర్థి :

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహరెడ్డిని కనిగిరి బరిలో నిలిపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉగ్రనరసింహ రెడ్డి వైసిపి చేతిలో ఓడిపోయారు... అయినప్పటికి ఆయనపై నమ్మకంతో ఈసారి మళ్లీ అవకాశం ఇచ్చారు. 

కనిగిరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

కనిగిరి అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,90,676 (82 శాతం) 

వైసిపి - బుర్రా మధుసూదన్ యాదవ్ - 1,12,730 ఓట్లు (58 శాతం) - 40,903 ఓట్ల మెజారిటీతో విజయం 

టిడిపి- ముక్కు ఉగ్రనరసింహరెడ్డి - 71,827 ఓట్లు (37 శాతం) - ఓటమి

కనిగిరి అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,58,970 (50 శాతం)

టిడిపి - కదిరి బాబురావు - 79,492 (50 శాతం) ‌- 7,107 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - బుర్రా మధుసూదన్ యాదవ్ - 72,385 (45 శాతం) ఓటమి