విజయవాడ ఎంపీ కేశినేని వ్యవహారం తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వరని అధిష్టానం కరాఖండీగా చెప్పేయడంతో నాని పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. 

విజయవాడ ఎంపీ కేశినేని వ్యవహారం తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వరని అధిష్టానం కరాఖండీగా చెప్పేయడంతో నాని పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. తనను టిడిపి పక్కనబెట్టడంపై కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికే టిడిపి తనను వద్దనుకుంది... అయినా ఆ పార్టీలో కొనసాగాలో వద్దో అభిమానులు, కార్యకర్తల నిర్ణయించాలని అన్నారు. వాళ్లు ఏం చెబితే అలా చేస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతానికి తన బాస్ చంద్రబాబు నాయుడే... ఆయన చెప్పినట్లే వింటానని నాని తెలిపారు.

తిరువూరులో చంద్రబాబు పాల్గొనే 'రా... కదలిరా' సభకు వెళ్లబోనని నాని స్పష్టం చేసారు. తనవల్ల గొడవలు జరుగుతాయని టిడిపి నాయకత్వం భావిస్తోంది... అందువల్లే రావద్దని ఆదేశించినట్లున్నారని అన్నారు. తన రాజకీయ భవిష్యత్ గురించి ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని... త్వరలోనే తీసుకుంటానని అన్నారు. తినబోతూ రుచుల గురించి తెలుసుకోవడం ఎందుకు... త్వరలోనే తన నిర్ణయమేంటో తెలియజేస్తానని నాని మీడియాకు తెలిపారు.

గతంలో తెలంగాణ టిడిపిలో రేవంత్ రెడ్డిపైనా ఇలాగే బుదరజల్లారని... ఇప్పుడు అతడు సీఎం అయ్యాడని నాని పేర్కొన్నారు. తాను అవినీతి, అక్రమాలు చేయలేదు... కాబట్టి ఎవరికీ భయపడనని అన్నారు. తనపై బురదజల్లేది ఎవరో తెలుసని... అవసరమైతే వాళ్లెవరో బయటపెడతానని నాని అన్నారు. 

కేశినేని వ్యవహారం తలనొప్పులు తెచ్చేలా వుండటంతో టీడీపీ అధిష్టానం అప్రమత్తమైంది. నానిని బుజ్జగించాల్సిందిగా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ను పంపింది. హైకమాండ్ ఆదేశాల మేరకు కేశినేని భవన్‌కు వచ్చిన రవీంద్ర కుమార్ .. నానితో దాదాపు గంటసేపు భేటీ అయ్యారు. రాజీనామా విషయంలో పునరాలోచించాలని ఎంపీకి చెప్పినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి భేటీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.