Asianet News TeluguAsianet News Telugu

గడ్డంగ్యాంగ్ అరాచకాలు...ఇళ్ల పట్టాల్లో రైలు పట్టాలంతా అవినీతి: కళా వెంకట్రావు

ఇళ్ల పట్టాల పేరుతో వైసీపీ ప్రభుత్వం  పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతోందని ఏపి టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు ఆరోపించారు. 

Kala Venkatrao sensational Comments on house patta distribution scheme
Author
Guntur, First Published Jun 29, 2020, 12:45 PM IST

గుంటూరు: ఇళ్ల పట్టాల పేరుతో వైసీపీ ప్రభుత్వం  పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతోందని ఏపి టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు ఆరోపించారు. ఓవైపు ఇళ్ల స్థలాల కోసం స్థానిక వైసీపీ నేతల భూములను అధిక ధరలకు కొంటూ అవినీతికి పాల్పడుతుంటే.. మరో వైపు ఇళ్ల స్థలాలు ఇస్తామని పేదల నుంచి  వైసీపీ నేతలు కోట్ల రూపాయలు కమిషన్లు దండుకుంటున్నారని అన్నారు. ఇప్పటికే  ఇళ్ల స్థలాల కోసం  ప్రభుత్వానికి భూములిచ్చిన రైతుల నుంచి రూ.1,400 కోట్లు కమీషన్లు... ఇళ్ల స్థలాలు ఇస్తామని పేదల నుంచి మరో రూ. 200 కోట్లు వసూలు చేశారు... ఇలా ఇప్పటికే మొత్తంగా రూ.1600 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 

''రైతుల దగ్గర నుంచి వైసీపీ నేతలు నెలా, రెండు నెలల క్రితం కొనుగోలు చేసిన భూములను ప్రభుత్వం నాలుగు రెట్లు అధిక ధర ఇచ్చి కొనాల్సిన అవసరం ఏంటి?  ఇళ్ల స్థలాల పధకం ప్రక్రియ ప్రారంభం కంటే రెండు నెలల ముందు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన భూ అమ్మకం,  కొనుగోళ్లపై  ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం కొనుగోలు చేసే భూములన్నీ స్ధానిక వైసీపీ నేతలవే. మార్కెట్ ధర కంటే అధికంగా పెంచి  ఎకరం రూ.  5 లక్షలు విలువ చేయని భూమిని రూ.45 లక్షల నుంచి రూ. 75 లక్షలకు కొంటున్నారు'' అని అన్నారు, 

''ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే రూ. 690 కోట్లు అవినీతి జరగ్గా.. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో రూ. 183 కోట్ల అవినీతి జరిగింది.  పెనమమూరు నియోజకవర్గంలో ఎకరం రూ. 40 లక్షల ఉంటే రూ. 75 లక్షలకు కొనుగోలు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలోని బూరుగుపూడి, కాపవరంలో పేదల ఇళ్ల కోసం అంటూ ముంపు భూములను కొనుగోలు చేశారు. రూ.5 లక్షల నుంచి 7 లక్షల విలువ చేసే భూములను రూ.20 లక్షల నుంచి 45 లక్షలకు కొనుగోలు చేస్తున్నారు.  రాష్ర్టం వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇదే తంతు జరుగుతోంది''  అని కళా పేర్కొన్నారు. 

read more  చంద్రబాబుతో లింక్స్: పవన్ కల్యాణ్ మీద ముద్రగడ ఉద్యమ అస్త్రం

''స్ధానిక వైసీపీ నేతలు కమిషన్ లు తీసుకుని పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు.  గ్రామీణ ప్రాంతాల్లో రూ. 10 వేలు ఇచ్చిన వారికి శ్మశానాల్లో,  రూ 30 వేలు ఇచ్చిన వారికి చెరువుల్లో, 60 వేల నుంచి రూ. లక్ష ఇచ్చిన వారికి ఊరికి దగ్గరల్లో ఇళ్ల స్ధలాలు  కేటాయిస్తున్నారు.  తణుకు నియోజకవర్గంలోని ఇరగవరం మండలం రేలంగిలో ఒక్కో ఇంటి పట్టా కోసం రూ. 40 వేల చొప్పున డిమాండ్ చేస్తున్నారంటూ ఇద్దరు లబ్ధిదారులు కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. తణుకు నియోజకవర్గంలో 60కిపైగా ఫిర్యాదులు వచ్చాయంటే ఎంత తీవ్ర స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్దం అవుతుంది'' అన్నారు. 

''పాలకొల్లులో భూమికి మంచి రేటు ఇప్పించినందుకు అందులో వాటా ఇవ్వమని చెప్పి వచ్చిన డబ్బులన్నీ వైసీపీ నాయకులే లాక్కొని మోసం చేశారని ఓ రైతు కేసు పెట్టడం భూసేకరణలో వైసీపీ దోపిడీకి ప్రత్యక్ష సాక్ష్యం. ముఖ్యమంత్రి జగన్  ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో పది మంది పేదల పొట్ట కొట్టి వైకాపాకు చెందిన ఎమ్మెల్యేలు, ధనవంతుల జేబులు నింపుతున్నారు. ఇళ్ల స్థలాల పేరుతో పేదలు, బడుగు, బలహీన వర్గాల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారు. దశాబ్దాలుగా దళితులు, బలహీన వర్గాలకు చెందిన సన్నకారు రైతులు, రైతు కూలీలు సాగుచేసుకుంటున్న భూములను లాక్కోని వారి జీవనాధారాన్ని దెబ్బతీశారు'' అని ఆవేదన వ్యక్తం చేశారు. 

'' ఆఖరికి చర్మకారులకు గత ప్రభుత్వం ఇచ్చిన భూములను కూడా లాక్కుంటున్నారు. చెరువు, వాగు, స్మశానం కోసం వదిలిన భూములు, పోరంబోకు, పాఠశాలల గ్రౌండ్స్, సామాజిక అవసరాల కోసం ఉపయోగించే భూములను స్వాధీనం చేసుకుంటున్నారు'' అని మండిపడ్డారు. 

''గుడివాడలో గడ్డం గ్యాంగ్ అరాచకాలు ఎక్కువయ్యాయి. బలవంతంగా పేదల నుంచి భూములు లక్కుంటున్నారు. ఇళ్ల పట్టాల్లో రైలు పట్టాలంతా అవినీతి జరిగింది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఇళ్ల స్థలాల కుంభకోణంలో జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపి బాద్యులపై  చర్యలు తీసుకోవాలి'' అని మాజీ మంత్రి కళా వెంకట్రావు డిమాండ్  చేశారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios