Asianet News TeluguAsianet News Telugu

కాకినాడ టీడీపీలో ఆధిపత్య పోరు: డిప్యూటీ సీఎంతో ఢీ అంటున్న ఎమ్మెల్యే

ఎన్నికలు సమయం దగ్గరకొస్తున్న తరుణనంలో అధికార తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తారా స్థాయికి చేరుతోంది. రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లాగా పేర్గాంచిన తూర్పుగోదావరి జిల్లాలో ఈ వర్గపోరు నిత్యం ఉండేదే. 

kakinada: political clashes between dy.cm and mla
Author
Kakinada, First Published Oct 22, 2018, 8:26 PM IST

కాకినాడ: ఎన్నికలు సమయం దగ్గరకొస్తున్న తరుణనంలో అధికార తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తారా స్థాయికి చేరుతోంది. రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లాగా పేర్గాంచిన తూర్పుగోదావరి జిల్లాలో ఈ వర్గపోరు నిత్యం ఉండేదే. 

అయితే జిల్లా కేంద్రమైన కాకినాడ నియోజకవర్గంలో మాత్రం ఈ ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరుకుంది. హోం శాఖ మంత్రిని ఢీకొట్టేందుకు స్థానిక ఎమ్మెల్యే రె ఢీ అంటున్నారు. ఎమ్మెల్యేను ఢీ కొట్టేందుకు మేయర్ సై అంటున్నారు. ఇలా ముగ్గురు మూడు గ్రూపులుగా ఏర్పడి ఎవరికి వారే యమునా తీరే అన్నచందంగా వ్యవహరిస్తున్నారు. 

డిప్యూటీ సీఎం హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్పకు, కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు ఏడాది కాలంగా పొసగడం లేదు. హోంశాఖ మంత్రిగా చినరాజప్ప జిల్లా కేంద్రంలోనే ఉండటం, నియోజకవర్గంలో వేలుపెట్టడంతో ఆధిపత్య పోరు మెుదలైంది. 

కాకినాడ అర్బన్ నియోజకవర్గంలో రాజప్ప ప్రమేయంపై కొండబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలో టీడీపీకి వ్యతిరేకంగా పని చేసిన కాంట్రాక్టర్లతో రాజప్ప కుమ్మక్కవుతున్నారని ఎమ్మెల్యే కొండబాబు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై గతంలో పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు కూడా. 

ఆ తర్వాత కాకినాడ జీజీహెచ్‌లో పారిశుధ్య కాంట్రాక్టు వ్యవహారంలో తనను కాదని రాజప్ప సొంత మనుషులకు కాంట్రాక్టు ఇప్పించారని కనీసం మాటవరుసకైనా తనతో చెప్పలేదని కొండబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెలకి రూ.36 లక్షల విలువైన పారిశుధ్య కాంట్రాక్టు వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలే రాజప్ప, కొండబాబు మధ్య వివాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. 
 
ఇటీవలే తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తాను అనే విషయంపై రాజప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్దాపురం కాకపోతే తాను కాకినాడైనా, ఇంకోచోటైనా పోటీచేయడానికి సిద్ధమేనంటూ ప్రకటించారు. రాజప్ప వ్యాఖ్యలు పుండుమీద కారం చల్లినట్లు అప్పటికే అక్కసుతో ఉన్న కొండబాబుకు మరింత ఆగ్రహానికి కారణమయ్యాయి.

నియోజకవర్గంలో రాజప్ప పెత్తనం, ఆయన వ్యాఖ్యలపై పార్టీ అధిష్ఠానం వద్ద పంచాయితీ పెట్టారట ఎమ్మెల్యే కొండబాబు. అధిష్టానం ఇద్దరిని వారించడంతో పరిస్థితి సద్దుమణిగింది. కానీ ఆధిపత్య పోరుమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఇరువురు ఎడమెహం పెడమెహంగానే ఉంటున్నారు. 

డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేల మధ్య వివాదం ఇలా ఉంటే కాకినాడ మేయర్‌ సుంకర పావని, ఆమె భర్త వ్యవహారం ఎమ్మెల్యేకు కొరకరాని కొయ్యగా మారింది. పావని తనను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఎమ్మెల్యే వనమాడి ఆరోపిస్తున్నారు. మేయర్‌ భర్త తిరుమలకుమార్‌ తనను ఖాతరు చేయట్లేదని, ప్రత్యర్ధి పార్టీల నేతలతో సఖ్యతగా ఉంటున్నారని కొండబాబు తన వర్గీయుల దగ్గర ఆరోపిస్తున్నారు. 
 
గతంలో మేయర్ పావని భర్త తిరుమల కుమార్ టీడీపీ నగర అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో ఎమ్మెల్యే కొండబాబుతో సన్నిహితంగా ఉండేవారు. ఇద్దరు ఒకే వర్గంగా పనిచేసేవారు.  అయితే కాకినాడ మేయర్ గా సుంకర పావని ఎన్నికైనప్పటి నుంచి ఆమెకానీ, తిరుమల కుమార్ కానీ తనను ఖాతరు చెయ్యడం లేదని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. 

అందువల్లే తిరుమల కుమార్ ని పార్టీ నగర అధ్యక్షుడి పదవి నుంచి తొలగించి చినరాజప్ప వర్గీయుడైన నున్న దొరబాబుకు కట్టబెట్టారు ఎమ్మెల్యే కొండబాబు. దీంతో అప్పటి వరకు రాజప్ప వర్గంలో ఉన్న దొరబాబు ఎమ్మెల్యే కొండబాబు వర్గంలోకి జంప్ అయ్యారు. 
  
ఇదిలా ఉంటే ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కాకినాడ సిటీలో పార్టీని ఏకతాటిపై నడపడంలో విఫలమయ్యారని సమాచారం. వర్గ విభేదాలను చక్కబెట్టలేకపోతున్నారని పైగా ఆయనే వర్గాలను ప్రోత్సహిస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. అటు ఎమ్మెల్యే సోదరుడుపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆ ఆరోపణలను మాత్రం ఎమ్మెల్యే కొండబాబు పట్టించుకోవడం లేదు. గిట్టని వాళ్లు తనపై ఇలాంటి ఆరోపణలు మోపుతున్నారని కొట్టి పారేస్తున్నారు. 
 
కాకినాడ అర్భన్ నియోజకవర్గంలో నెలకొన్న ఆధిపత్య పోరుపై జిల్లా టీడీపీ అధ్యక్షుడు నామన రాంబాబు స్పందించడం లేదు. తెలిసీతెలియనట్లుగా మిన్నకుండిపోయారు. జిల్లా పరిషత్ పదవి నుంచి తప్పించి పార్టీ జిల్లా అధ్యక్ష పదవితో సరిపెట్టారని తాను ఈ వివాదంలో తలదూర్చితే ఉన్నది కూడా ఊడిపోతుందన్న భయంతో నామన సైలెంట్ అయిపోయారు.  

మంత్రులు చినరాజప్ప, యనమల రామకృష్ణుడులను కాదని పార్టీలో ఏ నిర్ణయం తీసుకోవడానికి నామన సాహసించరన్నది అందరికీ తెలుసు. పేరుకే అధ్యక్షుడు అయినా వారి కనుసన్నుల్లోనే నామన నడుచుకోవాల్సిన పరిస్థితి. 

ఈ వ్యవహారంలో జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు చేతులెత్తేయడంతో ఇక సీనియర్ నేత మంత్రి యనమల రామకృష్ణుడు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దాలి లేకపోతే భవిష్యత్ లో ఈ ఆధిపత్య పోరు మరింత ముదిరి పార్టీకి ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉందని నేతలు సూచిస్తున్నారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

టీడీపీకి సునీల్ షాక్: కాకినాడ ఎంపీ అభ్యర్థిగా రాజప్ప!
Follow Us:
Download App:
  • android
  • ios