ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కడపలోని ఓ యువతిపై టిడిపి నేత తండ్రి అత్యాచార చేసిన సంగతి సంచలనంగా మారింది. కూతురు వయసున్న యువతిపై లైంగిక దాడికి పాల్పడటమే కాక దాన్ని వీడియో తీసి నాలుగు నెలలుగా బ్లాక్‌మెయిల్‌ చేస్తూ చిత్రహింసలు పెట్టాడు. పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో చివరకు ఆ యువతి మీడియాను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని గవర్నర్‌ నరసింహన్‌ను వేడుకుంది.

విషయం బాధితురాలి మాటల్లోనే ‘తల్లి చనిపోగా ఉపాధి కోసం మా నాన్నతో పాటు నా భర్త గల్ఫ్‌ వెళ్లారు. ఐదు నెలల నుంచి కడపలోనే లేడీస్‌ హాస్టల్‌లో ఉంటూ ఆస్పత్రిలో పని చేస్తున్నాను. ఈ సమయంలో ఖాజీపేటకు చెందిన సీఆర్‌ పాషా, ఖదీరుల్లాతో పరిచయం ఏర్పడింది. వారు ఆప్కో చైర్మన్‌ గుజ్జల శ్రీనివాసులు తండ్రి గుజ్జల రామకృష్ణ(70)తో చెప్పి ఉద్యోగం ఇప్పిస్తామని ఆయన వద్దకు తీసుకెళ్లారు. మైనార్టీ కార్పొరేషన్‌ నుంచి కుట్టుమిషన్‌తో పాటు తన కుమారుడు చైర్మన్‌గా ఉన్న ఆప్కోలో ఉద్యోగం ఇప్పిస్తానని రామకృష్ణ హామీ ఇచ్చారు’.

పెద్దాయన కావడంతో ఆయన మాటలు నిజమే అనుకున్నదట బాధితురాలు. ఆ తర్వాత రామకృష్ణ మాయమాటలు చెప్పి ఓ ఇంట్లోకి తీసుకెళ్లి బలాత్కారం చేశాడని ఆరోపిస్తున్నారు. కూతురు లాంటి దానినని ఎంతగా వేడుకున్నా ఆయన వినకుండా లైంగిక దాడికి పాల్పడ్డాడని కన్నీరుపెట్టుకుంది. ఆ తర్వాత నుంచి ఫోన్‌ చేసి బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలుపెట్టాడని వివరించింది.

రహస్యంగా వీడియో తీశానని, నగ్న వీడియోలు యూట్యూబ్‌లో పెడతానని బెదిరించి పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని వాపోయింది. దీనిపై కడప వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఫిర్యాదు చేయటానికి వెళ్తే ఏఎస్‌ఐ తనను దుర్భాషలాడాడని ఆరోపించింది. తెల్ల కాగితంపై సంతకం తీసుకొని రూ.50 వేలు ఇస్తాం వెళ్లిపోవాలంటూ బెదిరించినట్లు పేర్కొంది.

రామకృష్ణ ఆగడాలు భరించలేక నాలుగుసార్లు ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు వివరించింది. తనకు జరిగిన అన్యాయం మరెవ్వరికీ జరగకూడదని, వెంటనే నిందితుడిని అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేసింది. కాగా, రామకృష్ణ లైంగిక దాడికి సంబంధించిన వీడియోలు వాట్సాప్‌లో ప్రత్యక్షమయ్యాయి. సాక్షి కథనం మేరకు బాధితురాలు క్రింద విదంగా వాపోయింది.